తెలంగాణ

telangana

ETV Bharat / sports

India Rewind 2021: టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్ వీరే! - టీమ్​ఇండియా రికార్డులు 2021

Teamindia performance in 2021: అంతర్జాతీయ క్రికెటలో ఈ ఏడాది టీమ్​ఇండియా అంతగా రాణించలేకపోయిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ మొత్తంగా స్వదేశం, విదేశాల్లో కలిపి 13 టెస్టులు, ఆరు వన్డేలు, 16 టీ20లు ఆడింది. కాగా, ఈ ఏడాది ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో మన భారత జట్టు సాధించిన రికార్డులు, చెత్త ప్రదర్శనలను నెమరువేసుకుందాం..

టీమ్​ఇండియా రికార్డులు 2021, teamindia records 2021
టీమ్​ఇండియా రికార్డులు 2021

By

Published : Dec 31, 2021, 10:18 AM IST

Teamindia performance in 2021: భారత క్రికెట్‌ ఈ సంవత్సరం ఎన్నో ఒడుదొడుకులతో ముందుకు సాగింది. ఐసీసీ మెగా టోర్నీల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే విదేశాల్లో మన సత్తా ఏంటో మరోసారి చాటింది. 2021 ఏడాదిలో టీమ్‌ఇండియా ఇంటా బయటా కలిపి మొత్తం 13 టెస్టులు, ఆరు వన్డేలు, 16 టీ20లు ఆడింది. టీ20 వరల్డ్ కప్‌ సహా.. ఐదు ద్వైపాక్షిక సిరీసుల్లో తలపడింది. అన్ని ఫార్మాట్లలో మన భారత జట్టు చేసిన అత్యధిక, అత్యల్ప పరుగులు.. వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు, అత్యధిక వికెట్‌ టేకర్‌ వంటి వివరాలను ఈ ఏడాది పూర్తయిపోతున్న సందర్భంగా ఓసారి మననం చేసుకుందాం..

టెస్టుల్లో అత్యల్పం.. అత్యధికం ఇవే..

Teamindia highest score 2021: గతేడాది (2020) ఆఖర్లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా.. ప్రస్తుత సంవత్సరంలోనూ ఇలాంటి చెత్త ప్రదర్శనే చేసింది. అయితే అప్పటి కంటే కాస్త పర్వాలేదనిపించి 78 పరుగులకు ఆలౌటైంది. ఈ రికార్డు ఇంగ్లాండ్‌ పర్యటనలో చోటు చేసుకుంది. లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. దీంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.

ఇదే సిరీస్‌లో టీమ్‌ఇండియా ఈ ఏడాది అత్యధిక స్కోరు నమోదు చేయడం విశేషం. నాలుగో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి మరీ విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ (127), పుజారా (61), ఠాకూర్ (60), పంత్ (50) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 191 చేయగా.. ఇంగ్లాండ్‌ 290 పరుగులు చేసింది. అనంతరం 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 466 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 210 పరుగులకే ఆలౌట్‌ చేసి భారత్‌ విజయం సాధించింది.

టీమ్​ఇండియా ఇంగ్లాండ్​ సిరీస్​

వన్డేల్లోనూ ఇంగ్లాండ్‌పైనే.. కాకపోతే..

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటించింది. అందులో భాగంగా రెండో వన్డేలో టీమ్‌ఇండియా తొలుత 336/6 స్కోరు సాధించింది. అయితే ఇంగ్లాండ్‌ (337/4) దానిని ఛేదించి మరీ గెలుపొందింది. కేఎల్ రాహుల్ (108) శతకం సాధించాడు. ఈ ఏడాది వన్డేల్లో సెంచరీ బాదిన ఏకైక టీమ్‌ఇండియా ఆటగాడు రాహులే కావడం విశేషం.

మరీ తక్కువేమీ కాదులే..

శ్రీలంక పర్యటనకు శిఖర్ ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా వెళ్లింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. ఆఖరి వన్డేలో వర్షం పడటం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత భారత్‌ బ్యాటింగ్‌ చేసి 225 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏడాది టీమ్‌ఇండియా వన్డేల్లో చేసిన అత్యల్ప స్కోరు ఇదే. అయితే లంక కేవలం 39 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి విజయం సాధించింది.

టీమ్​ఇండియా శ్రీలంక సిరీస్​

టీ20ల్లో ఇలా..

టీమ్‌ఇండియా ప్రస్తుత సంవత్సరంలో 16 టీ20లు ఆడింది. అయితే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజీకే పరిమితమైంది. టీ20ల్లో అత్యధిక స్కోరును ఇంగ్లాండ్‌ మీద సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 224/2 స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 188కే పరిమితం చేసి విజయం సాధించింది.

ఇక టీ20ల్లో అత్యల్ప స్కోరు శ్రీలంక మీద కావడం గమనార్హం. అయితే లంక పర్యటనకు భారత్‌ రెండో జట్టు వెళ్లిన సంగతి తెలిసిందే కదా... శ్రీలంక స్పిన్నర్‌ వహిందు హసరంగ విజృంభించడం వల్ల భారత్‌ 20 ఓవర్లలో 81/8 స్కోరే చేయగలిగింది. అనంతరం లంక మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించేసింది.

వ్యక్తిగతంగా అత్యధిక స్కోరర్‌ ఎవరంటే..?

టెస్టులు: రోహిత్ శర్మ (161) సుదీర్ఘ ఫార్మాట్‌లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌ మీద శతకం బాదాడు. టెస్టుల్లో ఇతర భారత బ్యాటర్లు శతకాలు బాదినా.. ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

వన్డేలు: ఈ ఏడాది వన్డేల్లో సెంచరీ బాదిన ఏకైక టీమ్‌ఇండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కావడం విశేషం. ఇంగ్లాడ్‌ మీదనే పుణెలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (108) శతకం సాధించాడు. దీంతో భారత్‌ (336/6) అత్యధిక స్కోరు సాధించగలిగింది.

టీ20లు: భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ (80*) ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో తొలుత భారత 224/2 భారీ స్కోరు సాధించింది. అందులో విరాట్ కోహ్లీ (80 నాటౌట్), రోహిత్ శర్మ (64) రాణించారు.

ఎక్కువ వికెట్లు పడగొట్టింది వీరే...

టెస్టులు: భారత్ తరఫున టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్‌ (52) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో అంతర్జాతీయ బౌలర్లందరిలోనూ అశ్విన్‌నే ఎక్కువ వికెట్లు తీయడం గమనార్హం.

వన్డేలు: అసలు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు భారత్‌ ఆడిన వన్డేలే ఆరు. అందులోభువనేశ్వర్‌ కుమార్‌ (3/42) తొమ్మిది వికెట్లు తీసి ఈ ఏడాది ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.

టీ20లు:ఇక టీ20ల్లో రవిచంద్రన్ అశ్విన్‌ (3/20) తొమ్మిది వికెట్లు తీశాడు. ఐదు మ్యాచుల్లో 5.25 ఎకానమీతో రాణించాడు. టెస్టులు, టీ20ల్లో టీమ్‌ఇండియా తరఫున ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అశ్విన్‌ కావడం విశేషం.

అశ్విన్​

అరుదైన రికార్డును మిస్‌ చేసుకున్న రోహిత్..

టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు. 2013 నుంచి 2020 వరకు భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన రోహిత్‌ ఈ సారి మాత్రం అందుకోలేకపోయాడు. రోహిత్‌కు బదులు కేఎల్ రాహుల్ (108) ఈ ఏడాది అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా శతకం చేసిన ఏకైక ఆటగాడు కూడానూ కేఎల్‌ రాహులే కావడం విశేషం. రోహిత్ శర్మ 209 (2013), 264 (2014), 150 (2015), 171 (2016), 208 (2017), 162 (2018), 159 (2019), 119 (2020) వరుస సంవత్సరాల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రోహిత్​శర్మ


ఇదీ చూడండి: Team India Shedule 2022: వచ్చే ఏడాది టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details