మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, రహానె, పుజారా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా టీమ్‌ఇండియా టెస్టుల్లో విజయం సాధించడం ఆశ్చర్యకరంగా ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. "గత రెండేళ్లుగా మిడిలార్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. అయినా సరే ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు రాణించడం వల్లే భారత్ విజయాలను నమోదు చేయగలిగింది" అని అన్నాడు. గత రెండేళ్ల నుంచి కోహ్లీ 14 టెస్టుల్లో 26.08 సగటుతో 652 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా కూడా 19 మ్యాచుల్లో 26.52 సగటుతో 868 పరుగులు... రహానె 24.22 సగటుతో 17 టెస్టుల్లో 751 పరుగులు సాధించాడు. ముగ్గురు బ్యాటర్లలో రహానె ఒక్కడే సెంచరీ చేశాడు. అయినా సరే ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మీద సిరీస్‌లను భారత్ సొంతం చేసుకుంది.
టెస్టు క్రికెట్ కెరీర్‌లో అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా బ్యాటింగ్ యావరేజ్ తగ్గిపోవడం తననెంతో నిరుత్సాహానికి గురి చేసిందని ఇర్ఫాన్ తెలిపాడు. అలానే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ విఫలం కావడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. సీనియర్ బ్యాటర్లకు కుదురుకోవడానికి ఎక్కువ సమయం లేదని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారని గుర్తు చేశాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా 3 పరుగులు (33 బంతుల్లో), రహానె (0) గోల్డెన్‌డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి టెస్టులో రహానె (48, 20) కాస్త ఫర్వాలేదనిపించగా.. పుజారా (0, 16) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో వారి ప్రదర్శనపై ఇర్ఫాన్ విశ్లేషిస్తూ.. "తొలి టెస్టులో అజింక్య రహానె ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. అతడి ఫుట్‌వర్క్ కూడా బాగుంది. ఎంతో పాజిటివ్ దృక్పథంతో ఆడాడు. అయితే రెండో టెస్టులో (జోహన్నెస్‌బర్గ్) మాత్రం పుజారాతోపాటు రహానె కూడా నిరుత్సాహపరిచాడు. ఇప్పటివరకు ఒక్కొక్కరు భారత్ కోసం 80కిపైగా టెస్టులను ఆడారు. బ్యాటింగ్ యావరేజ్ 40 కంటే ఎక్కువ ఉండాలి. అయితే గత మూడు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ప్రదర్శన దారుణంగా ఉంది. అంతేకాకుండా వారి బ్యాటింగ్ సగటు కూడానూ 30 దిగువకు పడిపోయింది. ఇదే నన్ను చాలా నిరాశపరిచింది. మరోవైపు పుజారా, రహానెకు కుదురుకోవడానికి మరీ ఎక్కువ సమయం లేదనుకుంటున్నా. ఎందుకంటే టెస్టు కెరీర్ అరంగేట్రంలోనే శతకం చేసి శ్రేయస అయ్యర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. యువ ఆటగాళ్లు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. " అని వివరించాడు.
నాయకుడిగా ఎదిగాడు