Kohli Performance: ఆటలో గెలుపోటములు ఎంత సహజమో.. ఓ ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలూ అంతే సాధారణం. ప్రతి ఆటగాడూ ఏదో ఓ దశలో విఫలమవుతాడు. ప్రతి ఒక్కరికీ పేలవ దశ ఉంటుంది. కానీ కొంతమంది అసాధారణ ఆటగాళ్లకు ఆ మినహాయింపు ఉంటుంది. కెరీర్ సాంతం వాళ్లు ఒకే ఫామ్ కొనసాగిస్తూ ఉంటారు. టీమ్‌ఇండియాలో అడుగుపెట్టి.. అత్యున్నత ఫామ్ అందుకున్న తర్వాత కోహ్లి కూడా ఎప్పుడూ రాణిస్తూనే ఉంటాడని అంతా ఆశించారు. 2015 నుంచి 2019 నవంబర్ వరకూ అతని పరుగుల వేట నిరాటంకంగా సాగింది. అలవోకగా శతకాలు బాదేశాడు. కానీ ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అలాంటి మేటి ఆటగాడు ఇలా పరుగుల కోసం కష్టపడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. సెంచరీల సంగతి పక్కనపెడితే కనీసం క్రీజులో నిలబడి ఓ మోస్తరు స్కోర్లు చేయడమూ గగనమైపోయింది. ఈ సిరీస్ కాకుంటే ఆ సిరీస్ అంటూ.. అతను పుంజుకుంటాడని ఆశిస్తున్న అభిమానులు.. ఎంతకీ విరాట్ గాడిన పడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సచిన్‌కూ తప్పలేదు.. కానీ..భారత క్రికెట్ దేవుడు సచిన్ తెందుల్కర్ సైతం కెరీర్లో అప్పుడప్పుడూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక, అంచనాలను అందుకోలేక ఇబ్బంది పడ్డాడు. రికీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్, బ్రియన్ లారా.. ఇలా దిగ్గజాలందరూ ఏదో ఓ దశలో పేలవ ఫామ్‌ను ఎదుర్కొన్నారు. కానీ ఆ దశ సంక్షిప్తమే. వాళ్లు కోహ్లీలా సుదీర్ఘ కాలం పాటు పరుగులు చేయకుండా ఉండలేదు. 1974లో అరంగేట్రం చేసిన రిచర్డ్స్.. 1976లో ఓ ఊపు ఊపాడు. కానీ ఆ తర్వాత 1981 వరకు గొప్పగా రాణించలేకపోయాడు. ఆ తర్వాతే టాప్‌ఫామ్ అందుకున్నాడు. లారా, రికీ పాంటింగ్ ఎప్పుడూ రెండేళ్ల పాటు శతకం చేయకుండా ఉండలేదు. 2003, 2006లో గాయాలు, ఫామ్‌లేమితో సచిన్ ఇబ్బంది పడ్డాడు. క్లాస్ ఆటతీరుతో ఫామ్ అందుకుని 2007లో టెస్టుల్లో 55 సగటుతో 776 పరుగులు చేసి అదరగొట్టాడు. అతను తన కెరీర్ చివరి దశలో మాత్రమే 20 నెలల పాటు సెంచరీ చేయకుండా ఉన్నాడు. జట్టులో అతడి ప్రాధాన్యం తగ్గిందేమో కానీ.. తనెప్పుడూ జట్టుకు భారంగా మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు కోహ్లి భారమవుతున్నాడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతను మ్యాచ్‌ను గెలిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోతున్నాడు. మ్యాచ్‌లు గడిచినా కొద్దీ అతనిపై ఒత్తిడి ఇంకా పెరుగుతోంది.
అప్పటి నుంచే..2019 నవంబర్ తర్వాత ఏ ఫార్మాట్లోనూ కోహ్లి శతకం చేయలేదు. సెంచరీ సాధించలేనప్పటికీ ఆ తర్వాత కూడా బాగానే ఆడాడు. పరుగులు చేశాడు. కానీ పని భారం కారణంగా గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదులుకున్నాడు. వన్డే, టెస్టులకు సారథిగా కొనసాగాలనుకున్నాడు. దీంతో అతను ఇక ఆటపై మరింత దృష్టి పెట్టి దూకుడు అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా అతని ఆట మరింత దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక్కరే కెప్టెన్‌గా ఉండాలంటూ.. విరాట్‌ను తప్పించి వన్డే సారథ్య బాధ్యతలనూ రోహిత్‌కు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, కోహ్లి మధ్య వివాదం రాజుకుంది. అది తన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి అతని ప్రదర్శన ఇంకా పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో అతను టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. తన బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు. కెప్టెన్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు బ్యాటర్‌గానూ అతనా సమయంలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాడు. కానీ నాయకుడిగా వైదొలగడం తన ప్రదర్శనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచకప్ సంగతేంటి?ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. దీపక్ హుడా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ లాంటి ఆటగాళ్లు తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో పాగా వేయాలనే పట్టుదలతో ఉన్నారు. టీమ్‌ఇండియాలో చోటు కోసం ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సత్తాచాటుతున్న కుర్రాళ్లను పక్కకుపెట్టి.. వరుసగా విఫలమవుతున్న కోహ్లీని ప్రపంచకప్‌లో ఆడించడం ఎంతవరకు సమంజసమని మాజీలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రపంచకప్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కోహ్లి గురించి ఇంతలా చర్చ జరగడం జట్టుకు మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తనకు అండగా నిలిచే వాళ్లూ తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. కోహ్లి గురించి అతని గణాంకాలే చెబుతాయని, అతను తిరిగి పుంజుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విరామం తీసుకుని తిరిగి పునరుత్తేజితంతో సాగాలనుకుంటున్న కోహ్లీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఇప్పటికే కొన్నిసార్లు విరామం తీసుకున్న అతను తాజాగా వెస్టిండీస్ పర్యటన (3 వన్డేలు, 5 టీ20లు)నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం చివరి వన్డే తర్వాత అతను దాదాపు నెల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ సమయంలో తిరిగి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని మళ్లీ మునుపటి జోరుతో మైదానంలో చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.