Ashwin WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వరుస ఓటమిని చవి చూసింది టీమ్ఇండియా. ఈ క్రమంలో జట్టు ఎంపికపై నెట్టింట విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక జట్టుకు కీలకంగా భావించే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించకుండా భారత్ పక్కన పెట్టేసిన విషయం తమను ఎంతో బాధించిందంటూ అభిమానులు అశ్విన్ గురించి నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై స్పందించాడు. తనకు మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ విషయం తెలుసని చెప్పాడు. జట్టులో ఉంటే బాగుండేదని, అయితే భారత్ ఓడిపోవడం మాత్రం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు.
" నన్ను ఎందుకు పక్కన పెట్టారు..? అనేది చాలా కఠినమైన ప్రశ్న. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి భారత్ అడుగు పెట్టడం ఓ అద్భుతం. అయితే, నేను ఫైనల్‌లో ఆడి ఉంటే ఇంకా బాగుండేది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ నేను నాలుగు వికెట్లు తీశాను. బౌలింగ్‌లోనూ ఉత్తమంగానే ఉన్నాను. అయితే, ఈసారి కూడా భారత్ ఓడిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. 2018 -19 సీజన్ నుంచి విదేశాల్లోనూ ఎక్కువగానే వికెట్లు తీశాను. జట్టు విజయాల్లోనూ కీలక పాత్రే పోషించాను. టెస్టుల్లో ఎప్పుడైనా సరే నాలుగో ఇన్నింగ్స్ చాలా కీలకం. స్పిన్నర్‌ను తట్టుకోవడం కష్టం. కానీ, ఓవల్ మైదానంలో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. దీంతో ఏకైక స్పిన్నర్‌గా జడ్డూను తీసుకోవాల్సి వచ్చింది. బయటి నుంచి వస్తున్న విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నాకు నేనే విమర్శకుడిని. వారు నన్ను జడ్జ్ చేయడం మూర్ఖత్వం అవుతుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆలోచించేంత స్టేజ్‌లో నా కెరీర్ లేదు. నా సత్త ఏంటా నాకు తెలుసు. సరైన ప్రదర్శన ఇవ్వకపోతే దానికి తొలి విమర్శకుడిని నేనే అవుతాను. దానిపై నేను తీవ్రంగా కృషి చేసి మెరుగుపర్చుకుంటాను. అంతేకానీ, ఎవరు నన్ను జడ్జ్ చేస్తున్నారనేది నాకు అనవసరం" అని అశ్విన్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు.