తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా సమస్య తీర్చేవాడు ఒక్కడూ లేడా?

Teamindia Allrounder issue: ప్రపంచంలో మేటి జట్లన్నీ ఆల్‌రౌండర్లతో కళకళలాడుతుంటే.. కపిల్‌ దేవ్‌ తర్వాత బ్యాటుతో, బంతితో నిలకడగా సత్తా చాటే ఆటగాడి కోసం భారత్‌ దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. కొన్నేళ్ల ముందు హార్దిక్‌ పాండ్య ఆశాకిరణంలా కనిపించాడు. అతణ్ని అందరూ నయా కపిల్‌ అంటూ ఆకాశానికెత్తేశారు. కానీ ఈ సంబరం ఎంతో కాలం సాగలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలతో హార్దిక్‌ ఉన్నట్లుండి జట్టుకు దూరమయ్యాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పుడు కోచ్‌గా మారిన నేపథ్యంలో కనీసం అతనైనా ఆల్‌రౌండర్ల సమస్యపై దృష్టిసారించి నయా కపిల్‌లను తయారు చేస్తాడేమో చూడాలి.

Teamindia Allrounder problem
Teamindia Allrounder problem

By

Published : Jan 27, 2022, 6:44 AM IST

Teamindia Allrounder issue: "అవును.. భారత జట్టులో సమతూకం లోపించిన మాట వాస్తవమే. ఆల్‌రౌండర్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది"

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్‌కు గురైన అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యలివి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ దేశం మనది. ఇక్కడ కోట్లమంది క్రికెట్‌ ఆడతారు. లక్షల మంది ప్రొఫెషనల్‌ క్రికెటర్లున్నారు. కానీ వీరిలోంచి నిఖార్సయిన ప్రపంచస్థాయి పేస్‌ ఆల్‌రౌండర్లను తయారు చేసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రపంచంలో మేటి జట్లన్నీ ఆల్‌రౌండర్లతో కళకళలాడుతుంటే.. కపిల్‌ దేవ్‌ తర్వాత బ్యాటుతో, బంతితో నిలకడగా సత్తా చాటే ఆటగాడి కోసం భారత్‌ దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది.

ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ కొత్త బంతితో బౌలింగ్‌ చేస్తాడు. అలాగే ఓపెనింగ్‌లో వచ్చి బ్యాటింగూ చేయగలడు. ఈ స్థాయి ఆల్‌రౌండర్‌ను భారత జట్టులో ఊహించగలమా? పోనీ న్యూజిలాండ్‌ జట్టులో జిమ్మీ నీషమ్‌లో బౌలింగ్‌ కోటా పూర్తి చేసి.. మిడిలార్డర్లో మెరుపులు మెరిపించే ఆటగాడున్నాడా మనకు? ఇలా ఏ జట్టుతో పోల్చుకున్నా.. మన ఆల్‌రౌండ్‌ బలం అంతంతమాత్రమే. రవీంద్ర జడేజా లాంటి స్పిన్‌ ఆల్‌రౌండర్లయినా అడపా దడపా వస్తున్నారు కానీ.. పేస్‌ బౌలింగ్‌తో సత్తా చాటుతూ, బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణించే ఆటగాళ్లే కరవైపోతున్నారు. కొన్నేళ్ల ముందు హార్దిక్‌ పాండ్య ఆశాకకిరణంలా కనిపించాడు. మంచి పేస్‌తో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీయడమే కాక.. మిడిలార్డర్లో మెరుపులు మెరిపిస్తూ ఆశలు రేపాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు, చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనలతో అతను అంచనాలు పెంచేశాడు. అతణ్ని అందరూ నయా కపిల్‌ అంటూ ఆకాశానికెత్తేశారు. కానీ ఈ సంబరం ఎంతో కాలం సాగలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలతో హార్దిక్‌ ఉన్నట్లుండి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేసుకున్నాక పునరాగమనానికి చాలా సమయం తీసుకున్నాడు. తిరిగొచ్చాక కూడా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో అంతే. భారత్‌కు ఆడినా అంతే. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ స్థానాలకు చాలామంది పోటీ ఉండటం వల్ల హార్దిక్‌ను ఎంచుకోలేక పక్కన పెట్టేసింది భారత్‌. హార్దిక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిలకడగా రాణించిన సమయంలో అన్ని ఫార్మాట్లలో జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. జట్టుకు సమతూకం వచ్చేది. కూర్పుతో ఇబ్బందే ఉండేది కాదు. కానీ అతను ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరమైనప్పటి నుంచి తలనొప్పులు తప్పట్లేదు. హార్దిక్‌ అందుబాటులో లేనపుడు విజయ్‌ శంకర్‌కు అవకాశమిస్తే.. అతను భారత జట్టుకు చేసిన లాభం కంటే నష్టమే ఎక్కువ. మళ్లీ అతణ్ని ఎంచుకునే సాహసం భారత్‌ చేసే పరిస్థితి లేదు. కొన్ని నెలల ముందే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆలస్యం చేయకుండా జట్టులోకి తెచ్చేశారు. కానీ అతను అంచనాలను అందుకోలేకపోయాడు.

ప్రతిభావంతులు లేరా?

Teamindia Allrounders: దేశంలో క్రికెట్‌ ప్రతిభకు లోటేమీ లేదు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగల నైపుణ్యం ఉన్న క్రికెటర్లు వేలల్లోనే ఉంటారు. దేశవాళీల్లో అదరగొడుతున్న కుర్రాళ్లు.. ఐపీఎల్‌లో అవకాశం వస్తే కుర్రాళ్లు రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అండర్‌-19 స్థాయిలోనూ అద్భుత ప్రతిభతో కుర్రాళ్లు ఆకట్టుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వేర్వేరుగా ప్రతిభ చాటుతున్నారు. కానీ రెండు విధాలా ఉపయోగపడే ఆటగాళ్లే తక్కువైపోతున్నారు. ఆల్‌రౌండర్లుగా ఎదగగల ఆటగాళ్లను ముందే గుర్తించి వారిని తీర్చిదిద్డంలో వ్యవస్థ విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. జూనియర్‌ స్థాయిలో కుర్రాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ ఆకట్టుకుంటున్నప్పటికీ.. తర్వాతి స్థాయిల్లో ఏదో ఒక దాని మీదే దృష్టిపెడుతున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ నిలకడగా చేస్తూ, సత్తా చాటేంత ఫిట్‌నెస్‌, నైపుణ్యాలు ఆటగాళ్లలో కనిపించడం లేదు. ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌లో కోటా పూర్తి చేసి సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచి బ్యాటింగ్‌ చేయాలంటే ఎంతో ఫిట్‌నెస్‌ కావాలి. అందుకు తగ్గట్లుగా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడం కీలకం. ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో ఒక ఆల్‌రౌండర్‌ కనిపిస్తే వెంటనే టీమ్‌ఇండియాలోకి తెచ్చేసి మ్యాచ్‌ ఆడించేయడమే తప్ప.. వాళ్లను ప్రపంచ స్థాయి కోచ్‌లకు అప్పగించి మరింత మెరుగ్గా, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు తీర్చిదిద్దుతున్నారా అన్నది ప్రశ్న. భారత జట్టులోకి వచ్చాక పేస్‌ ఆల్‌రౌండర్లకు సరైన దిశా నిర్దేశం చేసి, వారి ఫిట్‌నెస్‌ పెంచి ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొరవడుతున్నట్లు కనిపిస్తోంది. హార్దిక్‌ మీద పని భారం పెరగకుండా చూడటంలో, అతడి ఫిట్‌నెస్‌ను కాపాడటంలో జట్టు యాజమాన్యం విఫలమైందన్నది వాస్తవం. ఇప్పుడు వెంకటేశ్‌ అయ్యర్‌ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. జూనియర్‌ కోచ్‌గా గొప్ప పనితీరును కనబరిచి, కుర్రాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పుడు కోచ్‌గా మారిన నేపథ్యంలో అతనైనా ఆల్‌రౌండర్ల సమస్యపై దృష్టిసారించి నయా కపిల్‌లను తయారు చేస్తాడేమో చూడాలి.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

గోల్ఫ్​ ఆడుతోన్న బుట్టబొమ్మ.. మతిపోగోట్టేస్తోందిరా మామ!

ABOUT THE AUTHOR

...view details