Womens Asia Cup 2022 : ఆసియా కప్‌లో భారత మహిళా జట్టు మళ్లీ గాడిలో పడింది. వరుసగా మూడు విజయాల తర్వాత పాక్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా.. కీలకమైన పోరులో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకొంది. ప్రస్తుతం భారత్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గ్రూప్ స్టేజ్‌లో టీమ్‌ఇండియా నాలుగో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 100 పరుగులే చేయగలిగింది. నిగర్ సుల్తానా (36), ఫర్గానా హక్ (30), ముర్షిదా ఖాతున్ (21) ఫర్వాలేదనిపించారు. టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో బంగ్లా ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. షఫాలీ వర్మ 2, దీప్తి శర్మ 2.. రేణుకా సింగ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను అక్టోబర్ 10న థాయ్‌లాండ్‌తో ఆడనుంది.
అదరగొట్టిన ఓపెనర్లు
పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన టాప్‌ఆర్డర్.. ఈసారి మాత్రం అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా ఓపెనర్లు షఫాలీ వర్మ (55) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్ స్మృతీ మంధాన (47) కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్ ప్రీత్ స్థానంలో స్మృతీ నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోడ్రిగ్స్ 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అయితే రిచా ఘోష్ (4), కిరన్ నవ్‌గిరె (0) విఫలం కాగా.. దీప్తి శర్మ 10 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుమానా అహ్మద్ 3, సల్మా ఖాతున్ ఒక వికెట్ తీశారు.