తెలంగాణ

telangana

ETV Bharat / sports

Team India U19: కొత్తగా '19 ప్లస్​' టీమ్​.. బీసీసీఐ యోచన - raj bawa

Team India U19: అండర్​ 19లో సత్తా చాటిన కుర్రాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించనుంది బీసీసీఐ. ఈమేరకు కొత్తగా 'అండర్‌-19+' వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాని ద్వార యువ ప్రతిభకు ప్రోత్సాహం అందించాలని చూస్తోంది.

team india under 19
under 19 world cup

By

Published : Feb 8, 2022, 11:00 AM IST

Team India U19: కమల్‌ పస్సి కొన్ని సీజన్ల కింద పంజాబ్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇక రవికాంత్‌ సింగ్‌ ఈ క్రికెట్‌ వ్యవస్థలో ఎక్కడున్నాడో తెలియదు. మంజోత్‌ కల్రా కెరీర్‌ కూడా ముందుకు సాగట్లేదు.. వీళ్లంతా గతంలో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినవాళ్లే. కానీ మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లుగా కనపడ్డ వీళ్లు క్రమంగా కనుమరుగయ్యారు. ఇప్పుడు బీసీసీఐ దృష్టిసారించాల్సింది ఈ సమస్యపైనే. ఈ నేపథ్యంలో కొత్త అండర్‌-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. తద్వారా 19 ఏళ్లు దాటిన అండర్‌-19 ప్రతిభావంతులు క్రికెట్‌ వ్యవస్థ పరిధిలో ఉండేలా, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పర్యవేక్షణలో వాళ్లు పురోగతి సాధించేలా చూడాలని అనుకుంటోంది.

టీమ్​ఇండియా అండర్-19

తాజా అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్‌ రషీద్‌ (ఆంధ్ర), రవి కుమార్‌ (బెంగాల్‌), రాజ్‌ అంగద్‌ బవా (చండీగఢ్‌), యశ్‌ ధుల్‌ (దిల్లీ)కు నేరుగా రంజీ జట్టులో చోటు దక్కొచ్చు. కానీ ప్రస్తుత జట్టులోని చాలా మంది అండర్‌-19 తదుపరి దశ, రంజీ ట్రోఫీకి మధ్య ఎటూ గాని స్థితిలో ఉండే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలో అండర్‌-25 విభాగం ఉంది. కానీ జట్లలోని కొన్ని స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది. "సీనియర్‌ భారత జట్టు కోసం ఆటగాళ్లను సిద్ధం చేయడానికి ఎన్‌సీఏ భవిష్యత్తులో అయిదు అంచెల వ్యవస్థపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ వ్యవస్థలో మొదట అండర్‌-16, ఆ తర్వాత అండర్‌-19, ఎమర్జింగ్‌ (జాతీయ అండర్‌-23), ఎ జట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు 19+ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ విభాగంలో ఈ కుర్రాళ్లందరినీ కలపొచ్చు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ విభాగాలన్నింటిలో బీసీసీఐ అండర్‌-25 (రాష్ట్ర 'ఎ' జట్టు) సీనియర్‌ స్థాయికి వెళ్లలేని ఆటగాళ్లకు వేదికలా ఉపయోగపడుతోంది.

యశ్ ధుల్

ఇప్పటికీ ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ క్రమం తప్పకుండా ఆడని 23-24 ఏళ్ల కుర్రాళ్లలో చాలా మంది సీనియర్‌ గ్రేడ్‌కు వెళ్లలేకపోవచ్చని కోచ్‌లకు తెలుసు. ఈ నేపథ్యంలో అండర్‌-19, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు మధ్య వారధి అవసరం. నాలుగు ఫస్ట్‌క్లాస్‌ స్థాయి మైదానాలతో కొత్త ఏన్‌సీఏ వాడుకలోకి వచ్చిందంటే.. అకాడమీ తన సొంత అండర్‌-19+ జట్లను కలిగి ఉండొచ్చు. తమలో తామే ఆడుతూ ఉండే ఈ జట్ల పురోగతిని కోచ్‌లు, ట్రెయినర్లు, ఫిజియోలు పర్యవేక్షించవచ్చు. వాళ్లు పై గ్రేడ్‌కు వెళ్లి రాష్ట్ర 'ఎ' జట్టు (అండర్‌-25) ఆడితే లేదా రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించవచ్చు. ఏ జట్టుకూ ఎంపిక కాకపోతే కనీసం ఎన్‌సీఏ పరిధిలోనైనా ఉంటారు. దీనిపై ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించడం కోసం బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి త్వరలో పది మంది జాతీయ సెలక్టర్లు (అయిదుగురు సీనియర్‌, అయిదుగురు జూనియర్‌), ఎన్‌సీఏ అధినేత లక్ష్మణ్‌, సీనియర్‌ జట్టు కోచ్‌ ద్రవిడ్‌ చర్చలు జరిపే అవకాశముంది.

"అండర్‌-19 ప్రపంచకప్పుతో మనమంతా పొంగిపోతున్నాం. మనకు గొప్ప వ్యవస్థ ఉంది. అందు వల్లే మన జూనియర్‌ జట్లు ప్రపంచ స్థాయిలో ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటున్నాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ వచ్చేసరికే తేడా వస్తోంది. 2012 అండర్‌-19 జట్టునే తీసుకోండి. హనుమ విహారి ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లెక్కడున్నారో తెలియదు. అందులో చాలా మంది కనీసం తమ తమ రాష్ట్రాల్లో అత్యుత్తమ దేశవాళీ ఆటగాళ్లుగా కూడా లేరు" అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి అన్నాడు.

'ఆంధ్రా క్రికెటర్‌ రషీద్‌.. భవిష్యత్తు నంబర్‌ 3'

యశ్, రషీద్

యశ్‌ ధుల్‌ నేతృత్వంలోని అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌ గెలిచి అభిమానులందరినీ సంబరాల్లో ముంచెత్తింది. ఈ కుర్రాళ్ల జట్టు ఒక్క ఓటమి లేకుండా టోర్నీని ముగించారంటే ఎంత ఆధిపత్యాన్ని ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. జట్టులో ఎందరో కుర్రాళ్లు తమ ఆటతో ఆకట్టుకున్నారు. అందులో ఒకడు వైస్‌ కెప్టెన్‌ రషీద్‌. ఈ 17 ఏళ్ల ఆంధ్ర కుర్రాడు టోర్నీలో 50.25 సగటుతో 201 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశాడు ఆంధ్రకే చెందిన భారత మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. రషీద్‌ భవిష్యత్తులో టీమ్‌ఇండియాకు మూడో స్థానంలో ఆడే బ్యాట్స్‌మన్‌గా మారే అవకాశముందని అన్నాడు.

"భవిష్యత్తులో పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్లో రషీద్‌ నంబర్‌ 3 కావొచ్చు" అని చెప్పాడు ప్రసాద్. "అతడు బంతిని ఆలస్యంగా ఆడతాడు. బంతిని ఎదుర్కొనేందుకు తగినంత సమయాన్ని తీసుకుంటాడు. అవి మంచి లక్షణాలు. అతడి సంయమనం కూడా ఆకట్టుకుంది. భారత్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడేమాత్రం ఇబ్బంది పడలేదు" అని అన్నాడు.

ఇవీ చూడండి:

U19 World Cup Final: కుర్రాళ్లు కుమ్మేశారు.. కప్ కొట్టేశారు

India under 19: అండర్-19 కుర్రాళ్లు.. భవిష్యత్​ తారలు

కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని.. విజేతలుగా ఎదిగి..

ABOUT THE AUTHOR

...view details