T20 World Cup 2022 India Squad : ఆసియా కప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తీవ్రంగా నిరాశపర్చింది. సూపర్-4లోనే ఇంటిముఖం పట్టింది. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడం.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మధ్యలోనే వైదొలగడం.. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కారణాలుగా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టు సరిగ్గా లేదనే విమర్శలూ వస్తున్నాయి. బుమ్రా లేని సమయంలో మరో సీనియర్ బౌలర్ షమీని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదనిపిస్తోందని ఇప్పటికే పలువురు అభిప్రాయపడ్డారు. వచ్చే ప్రపంచకప్ కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలని చెబుతున్నారు. ఇకనైనా జట్టులో ప్రయోగాలకు సెలవు ఇవ్వాలని సునిల్ గావస్కర్ వంటి క్రికెట్ దిగ్గజం సూచించాడు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఇలాంటి ప్రదర్శనతో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగడం చాలా కష్టమని ఆర్పీ సింగ్ తెలిపాడు. "ఆసియా కప్‌లో దారుణ ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా.. వచ్చే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగలేదు. ట్రోఫీని గెలుచుకోవాలంటే కొన్ని మార్పులు చేయాల్సిందే. ప్రపంచ కప్ లోపు జరిగే అన్ని మ్యాచుల్లోనూ (ఆసీస్, దక్షిణాఫ్రికా) తుది 11 మంది సభ్యులను ఆడించాలి. ఒకవేళ బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ పోతే మాత్రం ఇంకా అయోమయం పెరిగిపోయే ప్రమాదం ఉంది" అని ఆర్పీ సింగ్ వివరించాడు.
ప్రయోగాలు ఆపాలి..
ఆర్‌పీ సింగ్ చెప్పినట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇప్పటివరకు చేసిన మార్పులు ఇకనైనా ఆపేయాలి. ఓపెనింగ్ కోసం టీమ్‌ఇండియా దాదాపు ఐదారుగురు బ్యాటర్లను ప్రయత్నించింది. రోహిత్ శర్మతో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఓపెనింగ్‌కు దిగారు. చివరికి ఆసియా కప్‌లో మాత్రం రోహిత్-కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశారు. రాహుల్ లేకపోతేనే కోహ్లీతో ఓపెనింగ్ చేయించాలని మాజీలు సూచించారు. అప్పుడు సూర్యకుమార్‌ను మూడో స్థానంలో ఆడించాలి. కేఎల్ రాహుల్ ఫామ్ అందుకొని ఆడితే మాత్రం విరాట్ వన్ డౌన్‌లోనే రావాలి. నాలుగో స్థానంలో సూర్యకుమార్.. తర్వాత రవీంద్ర జడేజా (జట్టులో ఉంటే), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్/రిషభ్ పంత్ వస్తే బ్యాటింగ్ లైనప్ బాగుండే అవకాశం ఉంది.