Team India Practice Session : సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లు ముగించుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం టెస్టులకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 26న ఇరుజట్ల మధ్య తొలి ప్రారంభం కానుంది. దాదాపు 5 నెలల తర్వాత టీమ్ఇండియా టెస్టు ఫార్మాట్ ఆడనుంది. గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తొలిసారి బరిలో దిగనున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీలైనంత సేపు నెట్స్‌లోనే గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది.'టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నాడు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక రోహిత్, విరాట్‌తో పాటు యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ కూడా నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లేయర్లతోపాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
భరత్‌కు చోటు దక్కుతుందా? యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల వల్ల పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మేనేజ్మెంట్ శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేసిన భరత్‌కు తొలి టెస్టులో ఛాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది.