టీమ్ ఇండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ గత కొంతకాలంగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ, సెలక్టర్లు అతడిని జట్టుకు ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దీంతో అతడు తన కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక, బీసీసీఐతో తన బంధం ముగిసినట్లేనని.. అవకాశాల కోసం విదేశాల వైపు చూస్తున్నట్లు వెల్లడించాడు.
'బీసీసీఐతో నా బంధం ముగిసినట్లే.. 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తున్నారు.. విదేశాలపై చూస్తున్నా'
గత కొంతకాలంగా టీమ్ ఇండియాకు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ తన కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నాడు. అవకాశాల కోసం విదేశాల వైపు చూస్తున్నట్లు అతడు తెలిపాడు.
"బీసీసీఐతో దాదాపు నా బంధం ముగిసినట్లే. విదేశాలలో అవకాశాల కోసం చూస్తున్నాను. మరికొంత కాలం పోటీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. భారతదేశంలో 30 ఏళ్లు దాటిన వారిపై వివక్ష చూపిస్తారు(నవ్వుతూ). వాళ్లు మమ్మల్ని వీధిలో నడుస్తున్న 80 ఏళ్ల వృద్ధులుగా చూస్తారు. అయితే.. నేను ఎలాంటి వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. మీడియా కూడా దీన్ని భిన్నంగా చూడాలి. ప్రస్తుతం నేను సాధ్యమైనంత వరకు మంచి ఆటతీరును కనబరుస్తానని భావిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండడంతో బయట అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్తున్నాను.. మన చేతిలో ఉన్నది మాత్రమే మనం చేయగలం. మన చేతిలో లేని వాటిని నియంత్రించలేం. తర్వాత ఏం జరగాల్సి ఉంటే అది జరుగుతుంది" అని మురళీ విజయ్ అన్నాడు.
38 ఏళ్ల మురళీ విజయ్ చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున టెస్టు ఆడాడు. టీమ్ ఇండియా తరఫున ఇప్పటివరకు 61 టెస్టుల్లో 38.29 సగటుతో 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు ఆడి 339 పరుగులు, 9 టీ20ల్లో 169 పరుగులు చేశాడు.