T20 world cup 2022: భారీ స్టేడియం.. దాని నిండా జనం. మైదానంలో పరుగులు తీస్తూ ప్లేయర్లు. ఈ ఇదంతా చూసేందుకు స్టాండ్‌ల్లో కేరింతలు కొడుతూ.. తమ దేశాల జెండాలు పట్టుకుని ప్రేక్షకులు.. ఇదీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యే సన్నివేశం. దీని తర్వాతే మొదలవుతుంది అసలు యాక్షన్. పవర్ ప్లేలో సిక్స్‌లు ఫోర్లతో బ్యాటర్లు చెలరేగిపోతారు. బంతుల్ని ప్రేక్షకుల స్టాండుల్లోకి కొడతారు. బౌలర్లు వాయువేగంతో వేగంతో బంతిని విసిరి బ్యాటర్లపై విరుచుకుపడతారు. ఈ కథంతా కళ్ల ముందు కనబడటమే కాదు.. గుండె వేగంలోనూ వినిపిస్తుంది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా మొదలయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అంతకు మించి యాక్షన్ ఉండబోతోంది.
అక్టోబర్ 22 దాకా ప్రపంచ కప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం సూపర్ 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 12 దశకు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్-ఎ లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, గ్రూప్- బి లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12లో ఆడే ఛాన్స్ కొట్టేస్తాయి. అయితే అత్యధికంగా రెండు సార్లు కప్‌ను సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఈ సారి గ్రూప్ అర్హత మ్యాచ్‌లు ఆడనుండటం గమనార్హం.
టీమ్ ఇండియాకు గాయాల కలవరం..
ఈ సారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భారత్ బరిలో దిగబోతోంది. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. వరుసగా ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే జడేజా, బుమ్రా జట్టుకు దూరమయ్యారు. జట్టులోనూ నిలకడ కరవయ్యింది.
ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఎలా ఆడుతుందోనన్న ఆందోళన క్రీడా అభిమానుల్లో మొదలైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు గెలిచినా.. జట్టులోని సమస్యలు ఇంకా తొలగిపోలేదు. పేలవ ఫీల్డింగ్‌తో భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. ఛేజింగ్‌లోనూ టాప్ ఆర్డర్ ఆశించిన మేర ఆడటం లేదు.
బ్యాటింగ్ బాగుపడాలి..
టీమ్‌ఇండియాకు ప్రధాన సమస్య నిలకడలేమి. ఫలానా బ్యాటర్ స్థిరంగా ఆడతాడని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అదరగొట్టేస్తున్నప్పటికీ.. ఓపెనింగ్‌లో ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంచనాకు దొరకడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ మెగా టోర్నీల్లో విఫలమవడం భారత్‌ను కలవరానికి గురి చేసే అంశం.
ఇక లోయర్‌ఆర్డర్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గురించి కూడా ఆందోళన ఉంది. ఎందుకంటే హార్దిక్ కీలక ఆటగాడు. మ్యాచ్‌ను ఏ క్షణంలోనైనా మార్చే సత్తా అతడి సొంతం. అయితే హార్దిక్‌కు ఒకవేళ గాయమైతే అతడిని రిప్లేస్ చేయడానికి జట్టులో ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇది పక్కన పెడితే సిరిస్‌ల్లో మంచిగానే రాణించిన హార్దిక్.. ఇలాంటి మెగాటోర్నీలో రాణిస్తాడా అనే దానిపై ఆందోళన నెలకొంది.
అయితే ఏదో ఒక మ్యాచ్‌లో మెరవడం.. ఆ తర్వాత తేలిపోవడం టీమ్‌ఇండియా బ్యాటర్లకు అలవాటుగా మారిందని మాజీల విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా గత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.
డెత్ బౌలింగ్ మారాలి..
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. మిడిల్ ఓవర్లలో యవ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో హార్దిక్ పాండ్య పేస్ బౌలింగ్‌ను సమర్థంగా వేయగలడు. కానీ చివరి అయిదు ఓవర్లు చాలా కీలకం. మ్యాచ్గతిని మార్చే అవకాశం అక్కడే ఉంటుంది. బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా.. బ్యాట్‌ను ఝులిపిస్తారు. దీంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా బౌలర్లు డెత్ ఓవర్లలో విజయం సాధించాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్.. డెత్ ఓవర్ల స్పెషలిస్టు అనుకుంటే.. అంతగా ప్రభావం చూపలేక పోతున్నాడు.
కలిసొచ్చే అంశాలున్నాయ్..
ఇన్ని సమస్యల్లోనూ కలసి వచ్చే అంశాలూ ఉన్నాయి. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరు నిలకడగా ఆడి.. మంచి ప్రారంభం అందిస్తే.. మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ లేదా దినేశ్ కార్తీక్ లాంటి ప్లేయర్లు జట్టును విజయ తీరాలకు చేర్చే అవకాశముంది. పటిష్ఠ ప్రణాళికతో.. ఉన్నప్లేయర్లను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే.. రోహిత్ సేన కప్పు కొట్టడం ఖాయం.
ఇతర జట్లను పరిశీలిస్తే..
ఆదివారం నుంచి పారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌ను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా లాంటి బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారనేది వేచి చూడాలి. అయితే వరల్డ్‌కప్ నిలిచేందుకు ఏ జట్టుకు విజయావకాశాలున్నాయి..? టీమ్ ఇండియాకు ఏ జట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.