Team India ODI Ranking :2023 ప్రపంచ కప్కోసం యావత్ క్రీడాలోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ మెగాటోర్నీ మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టైటిల్ కోసం.. ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లు పోటీలో ఉండనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమ్ఇండియా ఓ అరుదైన ఘనతను అందుకునే ఛాన్స్ ఉంది. అదేంటంటే..
ప్రస్తుతం ఐసీసీ వన్డే టీమ్స్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(118 పాయింట్లు), పాకిస్థాన్ (118 పాయింట్లు) జట్లు టాప్‌లో ఉన్నాయి. వీటి తర్వాత స్వల్ప తేడాతో టీమ్ఇండియా (116 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే 2023 ప్రపంచకప్ కంటే ముందు ఆగ్ర స్థానానికి చేరేందుకు భారత్‌కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
2023 వరల్డ్ కప్ కంటే ముందు టీమ్ఇండియా.. మరో ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో రెండు ప్రస్తుత ఆసియా కప్‌లో, మరో మూడు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆసియా కప్ టైటిల్, ఆసిస్‌తో వన్డే సిరీస్ గెలిస్తే.. ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో రానున్న మ్యాచ్‌ల్లో ఎలాగైనా గెలిచి.. ప్రపంచ నెం.1 జట్టు హోదాలో టీమ్ఇండియా.. వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే టీమ్ఇండియా చివరిసారిగా.. 2022 మార్చ్‌లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.