తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ పని వాళ్లు చూసుకుంటారు.. చెప్పడానికి మీరెవరు'.. వారిద్దరికి దాదా సపోర్ట్! - Sourav Ganguly about rohit sharma

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి తర్వాత టీమ్ఇండియా ప్రధాన కోచ్, కెప్టెన్‌ కొనసాగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్‌ చేతిలో పరాజయం తర్వాత ఈ ఇద్దరిపై సోషల్​ మీడియాలో ట్రోల్స్​ మొదలయ్యాయి. వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాలంటూ కొందరు అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్​ సౌరభ్​ గంగూలీ ట్రోలర్స్​కు ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే ?

WTC Final 2023
rohit sharma and rahul dravid

By

Published : Jun 14, 2023, 1:23 PM IST

Ganguly Rohit Sharma : ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్​లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది టీమ్ఇండియా. ఫలితంగా విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు 'గద'ను దక్కించుకొంది. ఇక ఈ వైఫల్యాన్ని భరించలేని అభిమానులు టీమ్‌ఇండియాను నెట్టింట ట్రోల్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్​ కొనసాగింపుపై సందేహం నెలకొంది. వీరి కాంబినేషన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రావడం మినహా.. గొప్పగా సాధించిందేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు గతేడాది టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌ టోర్నీల్లో టీమ్‌ఇండియా ఓటమిని చవిచూసింది. దీంతో ఈ ఇద్దరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ సోషల్‌ మీడియాలో చెలరేగుతున్నాయి. అంతే కాకుండా వీరిపై విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తూ మీమ్స్‌ కూడా వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. ఆ బాధ్యత చూసుకోవడానికి సెలెక్టర్లు ఉన్నారని, మార్పులు చేసే పని వారిదేనంటూ పేర్కొన్నాడు.

"జట్టుకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాలంటే ఆ బాధ్యత సెలెక్టర్లపై ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ఎలా ప్రభావితం చేస్తుంది..? రెండేళ్ల కిందట విరాట్ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్సీ వద్దనుకోని దిగిపోయాడు. ఇప్పుడు భారత కెప్టెన్‌, కోచ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందని నన్ను అడుగుతారు? కానీ, రోహిత్, రాహుల్‌ ద్రవిడ్‌ తమ బాధ్యతలను సరిగ్గానే నిర్వర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వచ్చే ప్రపంచ కప్‌ వరకు వీరి కాంబినేషన్‌ను ఇలానే కొనసాగించాలి. ప్రపంచ కప్‌ తర్వాత రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నాకైతే తెలియదు. ఇప్పుడైతే వీరిద్దరు నా దృష్టిలో అత్యుత్తమమే అనిపిస్తోంది. భవిష్యత్తులో మంచి విజయాలు నమోదు చేయాలని ఆశిస్తున్నాను" అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

ఫీల్డింగ్‌ కూడా ఓ కారణమే: కైఫ్‌
IND VS AUS WTC Final : "భారత్‌ జట్టు ఓటమికి బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా ఓ ప్రధాన కారణమే. ఆసీస్‌ బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలను వదిలేయడం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. ఇక ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు చేసిన అలెక్స్‌ కేరీ వికెట్‌ను దక్కించుకొనే అవకాశం భారత్‌కు చేజారింది. స్లిప్‌లో అలెర్ట్‌గా ఉండాల్సిన పుజారా, కోహ్లీ వదిలేయడం ఆశ్చర్యంగానూ ఉంది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్‌ కొట్టిన బంతి స్లిప్‌లోని కోహ్లీకి కాస్త ముందుగా పడింది. ఒకవేళ అది అందుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో" అని మరో ప్లేయర్​ మహ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

ABOUT THE AUTHOR

...view details