మరో సారి బీసీసీఐ అధ్యక్ష పదవి సౌరవ్ గంగూలీని వరించే అవకాశం లేదు. ఈ విషయంపై గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దీనిపై కాబోయే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. గంగూలీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదని అన్నారు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్ష పదవిపై టీమ్ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడనే వార్తలను స్వాగతిస్తున్నట్లు రవిశాస్త్రి వెల్లడించాడు.
"స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఏ ఒక్కరూ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పదవిలో కొనసాగలేదు. దాదా గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలు.. కొంత మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారన్న మాటలు అన్నీ అసత్య ప్రచారాలు. ఎవరూ గంగూలీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొవిడ్ వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ.. బీసీసీఐ పని చేసిన తీరుపై అందరూ సంతృప్తిగా ఉన్నారు. దాదాకు మంచి కెప్టెన్‌గా విశిష్ఠమైన గుర్తింపు ఉంది. అయన టీమ్‌ని అంతా తనతో నడిపించేవాడు. మేము ఒక టీమ్ లాగా పని చేసేవాళ్లం." అని చెప్పారు.
రోజర్ బిన్నీ గురించి.. ఐపీఎల్ ఛైర్మన్ గురించి మాట్లాడారు ధుమాల్. గంగూలీ హయాంలో బోర్డు, క్రికెట్ ఎలా అభివృద్ధి చెందాయో వివరించారు. ఆయన బయటకు వెళ్లడంలో ఏ రాజకీయాలు లేవని చెప్పారు. ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కాబట్టి మనుషులకు ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ బీసీసీఐకి వచ్చేసరికి అందరి ఫోకస్ భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఉంటుందని చెప్పుకొచ్చారు.
వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీ ఆశించినా.. ఇతర సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో విరమించుకొన్నారు. దానిపైనా రవిశాస్త్రి స్పందించాడు. "వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా అయినవారు ఎవరూ లేరు. ఇప్పుడు మరొక క్రికెటర్‌కు అవకాశం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కొంతకాలం కేటాయించిన విధులు నిర్వర్తించడమే మన బాధ్యత. ఆ తర్వాత ముందుకు సాగిపోవడమే జీవితం. ఇక రోజర్ బిన్నీ సామర్థ్యం ప్రశ్నించలేం. అంతేకాకుండా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం అగ్రశ్రేణి ఆటగాళ్లను మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ప్లేయర్‌కు మంచి చేయగలడని భావిస్తున్నా. స్వతంత్రంగా పనిచేయగల సమర్థుడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గట్టిగా మాట్లాడగలడు" అని రవిశాస్త్రి వెల్లడించాడు. క్రికెట్ మైదానల్లో మౌలిక సదుపాయాలు, వసతులు ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిచాడు.