ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం.. వాకింగ్ స్టిక్ పట్టుకుని నడుస్తున్న ఫొటోలను పంత్ షేర్ చేశాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో వీడియోను పంచుకున్నాడు. అందులో మినీ స్విమ్మింగ్ పూల్‌లో చేతి కర్ర సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు పంత్ కనిపించాడు.
అయితే ఆ వీడియో చూస్తుంటే పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు పంత్ ఎమోషనల్ లైన్ రాసుకొచ్చాడు. పెద్ద విషయాలకు చిన్న విషయాల మధ్య జరిగిన ప్రతీ దానికి కృతజ్ఞతలు అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, పంత్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్లతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం నడుస్తున్న ఫొటోలను షేర్ చేసిన పంత్.. 'ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్‌గా' అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని కూడా పోస్ట్ చేశాడు. అందులో లూడో ఆడుతున్న ఫొటోను జత చేసి 'నేను ఇంత కన్నా ఏం చేయగలను.. ఏమైనా సూచనలు ఇవ్వగలరా' అంటూ రాసుకొచ్చాడు.