జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభకానుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో సత్తాచాటడానికి భారత పేస్ దళం సమయాత్తమవుతోంది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలతో కూడిన భారత పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు కంటే భారత జట్టు బౌలింగ్ దళమే ఉన్నతమైనదని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు. రికార్డులను పరిశీలిస్తే ఆ విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు.
'కివీస్ కంటే మా బౌలింగ్ దళమే మెరుగు' - కివీస్ బౌలింగ్ గురించి షమీ
న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. దీనిపై స్పందించిన భారత పేసర్ షమీ కివీస్ కంటే టీమ్ఇండియా బౌలింగ్ దళమే మెరుగ్గా ఉందని తెలిపాడు.
"మేం టెస్టు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏ బౌలరైనా విఫలమైనప్పుడు మిగతా బౌలర్లు పుంజుకుంటారు. ఆ సహచరుడు మంచిగా బౌలింగ్ చేసేందుకు సలహాలు, సూచనలిస్తూ ప్రోత్సాహిస్తాం. జట్టును ఒక యూనిట్‌గా ముందుకు తీసుకెళ్తాం. న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, నీల్ వాగ్నర్ కంటే మా బౌలింగ్ దళం ఉన్నతమైనది. రికార్డులను పరిశీలిస్తే ఈ విషయంలో మీకు స్పష్టతవస్తుంది. రాత్రికి రాత్రే అభిమానులు పుట్టుకురారు. వాళ్లకు చరిత్ర అంతా తెలుసు. ఫాస్ట్‌బౌలింగ్ త్రయం ( మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ) ఏర్పడటానికి ఎంతో కష్టపడ్డాం" అని షమీ అన్నాడు.