Team India Batting Coach: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సారథి విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై స్పందించాడు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్. విరాట్ మంచి బంతులను ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
"కోహ్లీకి చాలా సార్లు పరుగులు ఇచ్చిన షాట్ అది. కానీ, కొన్ని సార్లు అతడి బలమే.. అతడి బలహీనతగా మారొచ్చు. ఓ బంతిని ఆడకపోతే క్రికెటర్ ఔట్ అవడు. అలాగే దానికి పరుగు కూడా రాకపోవొచ్చు. కానీ, ఆ బంతిని ఎప్పుడు ఆడాలనేది నిర్ణయించుకోవడం ముఖ్యం."
--విక్రమ్ రాథోడ్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్
కోహ్లీ ఔటైన తీరుపై టీమ్ఇండియా మాజీలు సహా అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Team India Batting Coach: ఫామ్‌కోల్పోయి సతమతమవుతున్న టీమ్‌ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె రాణించేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నారని చెప్పాడు విక్రమ్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులోనూ వీరిద్దరు మరోసారి విఫలమైన నేపథ్యంలో బుధవారం మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడాడు. వారిపై ఒత్తిడి తీసుకురాకుండా జట్టు యాజమాన్యం వేచిచూసే వైఖరి అనుసరిస్తోందని తెలిపాడు.
"పుజారా, రహానె మళ్లీ గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు 100 శాతం కష్టపడుతున్నారు. రహానె తిరిగి లయ అందుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. పుజారా కూడా రాణించలేదు. అతడు గతంలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, దక్షిణాఫ్రికా పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇక్కడ ఎక్కువ మంది పరుగులు చేయలేదు. వాళ్లిద్దరూ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నంత కాలం ఓపికతో ఉండాలి. వాళ్లకు అత్యుత్తమ కోచింగ్ ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మేమెంతో ఓపికతో ఉన్నాం"