Team India 2024 Schedule: 2023లో అన్ని ఫార్మట్లలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా కొత్త ఏడాదిలో మూడు కీలక సిరీస్‌లు ఆడనుంది. గత ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లతోపాటు ఆసియా కప్ గెలుచుకున్న టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్‌ను మాత్రం మిస్ అయింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆరంభం నుంచి అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్స్‌కు దూసుకొచ్చినా, తుదిపోరులో పరాజయం చవిచూసింది.
అయితే ఈ ఏడాది టీమ్ఇండియా ప్రధానంగా మూడు సిరీస్‌ల్లో ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో టీమ్ఇండియా ప్రదర్శనపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గత ఏడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది ఈ ఇద్దరు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పొట్టి క్రికెట్ టోర్నీలో వీరి ప్రదర్శనపై ఆసక్తి పెరుగుతోంది. ఇక టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాన్ని శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ప్రధానంగా జరిగే మూడు సిరీస్‌లు ఏంటంటే?
భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. జనవరి 25 నుంచి మార్చి 27 వరకు ఈ సిరీస్ జరగనుంది. గత ఏడాదిన్నరగా స్టోక్స్ నాయకత్వంలో తిరుగులేని విజయాలు సాధిస్తున్న ఇంగ్లాండ్‌ను, రోహిత్ కెప్టెన్సీలో భారత్ తొలిసారి ఢీకొట్టనుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లాండ్ జట్టు ఏ మేరకు రాణిస్తుంది? యువ ప్లేయర్లతో కూడిన టీమ్ఇండియా ఎలా ఆడనుందని సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.
2024 టీ20 వరల్డ్‌కప్
వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా 2024 టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టోర్నీ జూన్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్ జట్టు ఎలా ఉండనుంది? టీమ్ఇండియాకు నాయకత్వం వహించేదెవరు? ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ మదిలో ఉన్నాయి. అయితే గత 13 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కల ఇప్పుడైనా తీరాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జరగనుందో!