Tamim Iqbal Retired : బంగ్లాదేశ్ జట్టు సారథి, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలుపలుకుతున్నట్లుగా అతడు గురువారం ప్రకటించాడు. ప్రపంచకప్ సమరానికి సిద్ధమవ్వాల్సిన తరుణంలో తమీమ్ ఇలా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ క్రికెట్ బోర్డును ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అయితే బుధవారం బంగ్లాదేశ్‌లోని జాహుర్ అహ్మద్ చౌదరీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లా జట్టు ఓడిపోయిన కొన్ని గంటలకే తమీమ్ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాటల్లో కలిపి మొత్తం 389 మ్యాచ్‌లాడిన ఈ స్టార్ ఆటగాడు.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
తమీమ్ ఇక్బాల్ ట్రాక్ రికార్డ్..
ఫార్మాట్ | మ్యాచులు | పరుగులు | సెంచరీలు | హాఫ్ సెంచరీలు | టాప్ స్కోర్ |
టెస్టులు | 70 | 5134 | 10 | 31 | 206 |
వన్డేలు | 241 | 8313 | 14 | 56 | 158 |
టీ20లు | 78 | 1758 | 1 | 7 | 103* |
కన్నీరు పెట్టిన కెప్టెన్..!
Bangladesh vs Afghanistan ODI : మొత్తం మూడు ఫార్మాటుల్లో కలిపి బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున తమీమ్ 15,205 పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో తనక సపోర్ట్ చేసిన అభిమానులతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన తరుణం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తమీమ్ ఇక్బాల్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. అయితే మళ్లీ షకిబ్ అల్ హసన్‌కు గానీ లిటన్ దాస్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. బంగ్లా-అఫ్గానిస్థాన్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే జులై 8న, మూడో వన్డే జులై 11న జరగనుంది.