కొన్నేళ్ల నుంచి ద్వైపాక్షిక వన్డే, టీ20 సిరీస్‌ల్లో కొత్త, యువ ఆటగాళ్లకు పెద్ద ఎత్తునే అవకాశం ఇస్తున్నారు సెలక్టర్లు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా కుర్రాళ్లకే పెద్ద పీట వేశారు. ఇటీవలే టీ20 లీగ్ ముగియడం, త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లాల్సి ఉండటంతో రోహిత్, కోహ్లి, బుమ్రా, షమి లాంటి సీనియర్లకు ఈ సిరీస్ నుంచి దూరం పెట్టారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు చాలామందే అవకాశం దక్కించుకున్నారు. అందులో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడిన, కొత్త బౌలర్లే ఎక్కువ. ఇంకో నాలుగైదు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ యువ బౌలర్లకు సఫారీ సిరీస్ గొప్ప అవకాశం అనడంలో సందేహం లేదు. మరి ఈ సిరీస్‌లో సత్తా చాటి పొట్టి కప్పు దిశగా అడుగులేసే బౌలర్లెవరన్నది ఆసక్తికరం.
ఆ వేగం ఇక్కడా చూపిస్తాడా?.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తున్న ఆటగాడు ఉమ్రాన్ మాలికే అనడంలో సందేహం లేదు. టీ20 లీగ్‌లో హైదరాబాద్ తరఫున మెరుపు వేగంతో బంతులేస్తూ, వికెట్ల మీద వికెట్లు తీస్తూ అతను చర్చనీయాంశంగా మారాడు. అతనాడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యంత వేగవంతమైన బంతితో భారత టీ20 లీగ్ అవార్డు గెలుచుకున్నాడతను. గత సీజన్లోనూ వేగంతో అతనూ ఆకట్టుకున్నప్పటికీ.. ఈసారి బంతి మీద నియంత్రణ, కచ్చితత్వం కూడా తోడవడంతో వికెట్ల పంట పండించుకోగలిగాడు. 14 మ్యాచ్‌ల్లో 20.18 సగటుతో అతను 22 వికెట్లు తీశాడు. చాలామంది దిగ్గజ ఆటగాళ్లు అతడిని భవిష్యత్ తారగా అభివర్ణించారు. టీమ్‌ఇండియాలోకి వస్తాడని అంచనా వేశారు. ఆ మాటను వెంటనే నిజం చేశాడు ఈ జమ్ము-కశ్మీర్ బౌలర్. మరి అతను టీమ్‌ఇండియా తరఫునా ఇదే వేగం, కచ్చితత్వం చూపిస్తాడా అన్నది చూడాలి. పేస్ బౌలింగ్‌ను బాగా ఆడే సఫారీ బ్యాట్స్‌మెన్‌ను అతను కట్టడి చేయగలిగితే.. తర్వాతి సిరీస్‌లకూ ఎంపిక కావడం, అలాగే ఆస్ట్రేలియాకు అతను టికెట్ సంపాదించడం ఖాయం.
ఆ నైపుణ్యంతోనే అవకాశం.. 14 మ్యాచ్‌లు.. 10 వికెట్లు.. 38.50 సగటు.. భారత టీ20 లీగ్ ఈ సీజన్లో ఇలాంటి గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌ను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయడం సమంజసం అనిపించదు. కానీ ఈ గణాంకాలతో అర్ష్‌దీప్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక కావడం ఎవరికీ అభ్యంతరకరంగా అనిపించలేదు. ఎక్కువ వికెట్లు తీయలేదన్న మాటే కానీ.. ఈ సీజన్లో అర్ష్‌దీప్ బౌలింగ్ గొప్పగా సాగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసిన వైనం అమోఘం. స్టార్ బౌలర్లు కూడా 8-9 మధ్య ఎకానమీ నమోదు చేస్తే.. అతను మాత్రం సగటున ఒక్కో మ్యాచ్‌కు 7.7 చొప్పునే పరుగులు ఇచ్చాడు. ఏ బ్యాట్స్‌మనూ అతడి బౌలింగ్‌లో ధాటిగా ఆడలేకపోయాడు. చివరి ఓవర్లలో అతడి నైపుణ్యం చూసే.. చాలామంది మాజీలు అతణ్ని భారత జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సెలక్టర్లు కూడా అలాగే ఆలోచించారు.