T20 World Cup: కంగారూ గడ్డపై తొలి టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు నెల రోజుల పాటు పొట్టి కప్పు సందడే సందడి. ఆదివారం నుంచి వచ్చే నెల ఫైనల్ జరిగే 13వ తేదీ వరకు క్రికెట్ ప్రేమికులకు పండగే. ఈ మెగా టోర్నీలో మొదట తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్-12లో చోటు కోసం ఈ అర్హత రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. తొలి రోజు గ్రూప్- ఎలో నమీబియాతో శ్రీలంక, నెదర్లాండ్స్‌తో యూఏఈ తలపడతాయి. సోమవారం గ్రూప్- బిలో స్కాట్లాండ్‌తో వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జింబాబ్వే ఆడతాయి.
తొలి రౌండ్ మ్యాచ్‌లు ముగిసే సరికి గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే సూపర్-12లో.. గ్రూప్-1లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, గ్రూప్-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ ప్రధాన మ్యాచ్‌లు ఈ నెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోరుతో మొదలవుతాయి. సూపర్-12లో ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా అయిదింటితో మ్యాచ్‌లాడుతుంది. ఆ గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి.
మళ్లీ పాక్‌తో..:క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే భారత్, పాక్ పోరు మరోసారి అలరించనుంది. ఐసీసీ టోర్నీల పుణ్యామా అని ఇటీవల ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం తరచుగా కలుగుతోంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో దాయాది చేతిలో టీమ్‌ఇండియా అనూహ్య పరాజయం పాలైంది. ఈ ఏడాది ఆసియా కప్‌లో ఇవి రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు పొట్టి కప్పు వేదికైంది. ఈ నెల 23న పాక్‌తో పోరుతోనే భారత్ కప్పు వేట మొదలెడుతుంది. ఎంసీజీలో జరిగే ఆ మ్యాచ్‌కు 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరు కానున్నారు. అనంతరం తొలి రౌండ్ గ్రూప్- ఎ రన్నరప్‌తో 27న, దక్షిణాఫ్రికాతో 30న, బంగ్లాదేశ్‌తో నవంబర్ 2న, తొలి రౌండ్ గ్రూప్- బి విజేతతో 6న రోహిత్ సేన ఆడుతుంది.
వీళ్లు దూరం..:ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్ల గాయాలు ఆయా జట్లను గట్టిగానే దెబ్బతీశాయి. ముఖ్యంగా గాయంతో బుమ్రా దూరమవడం టీమ్‌ఇండియాకు తీవ్ర లోటు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెయిర్‌స్టో, ఆర్చర్ కూడా గాయాలతో టోర్నీలో ఆడడం లేదు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ప్రిటోరియస్ కూడా తప్పుకున్నాడు. మరోవైపు 2010 తర్వాత మళ్లీ దినేశ్ కార్తీక్ ప్రపంచకప్ ఆడబోతున్నాడు. 2007 ఆరంభ టోర్నీ నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రపంచకప్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లుగా టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ నిలవబోతున్నారు.