టీ20 ప్రపంచకప్ సూపర్ -12 దశ నుంచి అప్ఘానిస్థాన్ దాదాపు వైదొలిగినట్లే. గత ఆసియా కప్‌లో శ్రీలంకను ఓడించిన అఫ్గానిస్థాన్ మరోసారి సంచలనం సృష్టిస్తుందేమోనని అంతా భావించారు. కానీ శ్రీలంక అన్ని విభాగాల్లో రాణించి తాజా మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను లంక (4 పాయింట్లు) సజీవంగా ఉంచుకొంది. నవంబర్ 5న ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉంది. తన ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో (నవంబర్ 4న) తలపడనుంది.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ (28) టాప్ స్కోరర్ కాగా.. ఉస్మాన్ ఘని 27, ఇబ్రహీం జద్రాన్ 22, నజీబుల్లా 18, గుల్బాదిన్ 12, నబీ 13, రషీద్ ఖాన్ 9 పరుగులు చేశారు. లంక బౌలర్లలో వహిందు హసరంగ 3, లాహిరు కుమార 2.. రజిత, డిసిల్వా చెరో వికెట్ తీశారు.