టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకొని ఛేజింగ్ చేసి ప్రత్యర్థిని ఎలా చిత్తుచేయాలో కోహ్లీ ప్రాక్టికల్‌గా చూపించాడు. యువక్రికెటర్లకు ఈ ఇన్నింగ్స్ నిస్సందేహంగా ఓ పాఠం. తరానికొక్కటిగా నిలిచే ఇన్నింగ్స్‌ను ఆడి భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు.
"మూడేళ్లు మూడంకెల స్కోర్ చేయని ఏ ఆటగాడైనా జట్టులో కొనసాగడం కష్టం. అయితే.. విరాట్‌కే అది సాధ్యమైంది".. 71వ శతకం పూర్తి చేశాక ఓ మాజీ నుంచి వచ్చిన వెటకారంతో కూడిన ప్రశంస ఇది..! మరోవైపు 'ఆ..అఫ్గాన్ మీద శతకమేగా..' అంటూ విరాట్‌పై హేటర్స్ చిన్నచూపు..! ఇక ఆచితూచి ఆడుతూ ఆసియాకప్‌లో మంచి స్కోర్లు చేస్తున్న సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండే 'కింగ్' బాడీ లాంగ్వేజ్ కనిపించలేదు. దీంతో 'ఒక్కటి తగ్గింది' అని అభిమానులు కలవరపడుతున్న సమయం..! రెండు పర్యటనలకు విశ్రాంతి తీసుకొని.. మునపటి లయను అందిపుచ్చుకోవడానికి విరాట్ మెల్లగా అడుగులు వేస్తున్న సమయంలో వినిపించిన కామెంట్లివీ..!
విశ్వరూపం.. తాజాగా పాకిస్థాన్‌పై మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 'కింగ్ కోహ్లీ' ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. ఈ ఆట మొత్తంలో విరాట్ బాడీలాంగ్వేజ్ ఓ ఛాంపియన్‌లా ఉంది. కళ్లముందే టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా.. ప్రశాంతంగా ఉన్నాడు. ఏడు ఓవర్లకు టీమిండియా స్కోర్ 33/4 వద్ద హార్దిక్‌తో శతక భాగస్వామ్యానికి పునాదులు వేయడం మొదలుపెట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి విరాట్ 21 బంతుల్లో 12 పరుగులు మాత్రమే సాధించాడు. ఒక్క ఫోర్‌గానీ, సిక్స్‌గానీ లేదు. ఈ రన్‌రేట్ చూసి.. టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా ఏంటీ..? అనుకొంటూ అభిమానులు నీరసపడి పోయారు. ఈ సమయంలో విరాట్‌పై ఒత్తిడి పెంచేందుకు పాక్ 11 ఓవర్‌లో నవాజ్ బౌలింగ్‌లో ఓ క్యాచ్ అప్పీల్ రివ్యూకి తీసుకెళ్లింది. కోహ్లీ ముఖంలో ఏ మాత్రం టెన్షన్ కనిపించలేదు. అతడు ఊహించినట్లే.. నిర్ణయం పాక్‌కు ప్రతికూలంగా వచ్చింది. ఆ తర్వాతి బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ కొట్టి బౌలర్ ఆత్మవిశ్వాసాన్ని పటాపంచలు చేశాడు.
ఊచకోత.. ఇక అక్కడి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.. కోహ్లీ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక్కసారిగా దూకుడుగా మారిపోయింది. షాట్లు కొట్టినప్పుడల్లా హార్దిక్‌తో ఫిస్ట్ బంప్స్ కొడుతూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విరాట్ సమరోత్సాహంతో కనిపించాడు. 11-16 ఓవర్ల మధ్యలో కోహ్లీ 18 బంతులు ఆడి 31 పరుగులు చేశాడు. దానిలో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆ ఓవర్లలో స్ట్రైక్ రేటు 172..! ఇక డెత్ ఓవర్లు వచ్చేటప్పటికి కోహ్లీలోని 'కింగ్' బయటకు రావడంతో పాక్ బౌలింగ్ దళం కకావికలమైంది. 17-20 ఓవర్ల మధ్యలో 14 బంతులు ఆడిన కోహ్లీ ఏకంగా 278 స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు చేశాడు. వీటిల్లో మూడు ఫోర్లు.. మూడు సిక్స్‌లు ఉండటం కింగ్ ఊచకోతను తెలియజేస్తోంది. ఒత్తిడిలో చెలరేగిపోవడం విరాట్ సహజశైలి..! గత మూడేళ్లుగా మిస్సైన ఆ ఆత్మవిశ్వాసాన్ని విరాట్ మళ్లీ అందిపుచ్చుకొన్నాడు.