టీ20 వరల్డ్‌కప్ సూపర్-12 కీలక దశకు చేరుకుంటోంది. సెమీఫైనల్లో ఏ జట్లు నిలుస్తాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ ఫేవరెట్లుగా ఉన్నాయి. ఇందులో టీమ్ఇండియా తన తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుకుంటుంది.
వర్షం ముప్పు.. అయితే అడిలైడ్ వేదికగా నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వర్ష గండం ఉందని తెలిసింది. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా భారత్, బంగ్లా మ్యాచ్ రద్దై.. ఇరు జట్లకూ చెరో పాయింట్ వస్తే.. సెమీస్ రేస్ మరింత రసవత్తరంగా మారుతుంది.
దీంతో టీమ్ఇండియా తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే బంగ్లా చేతిలో పాక్ చిత్తుగా ఓడితే.. భారత్-పాక్ జట్ల ఖాతాలో పాయింట్లు సమం అవుతాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు టాప్-4లోకి అడుగు పెడుతుంది. ఇప్పటికైతే భారత్‌కే మెరుగైన రన్ రేట్ ఉంది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌ల సమయంలో వర్షం కురిస్తే.. రోహిత్ సేన ఇబ్బందుల్లో పడుతుంది. ఈక్వేషన్లు వేగంగా మారిపోతాయి.
పాకిస్థాన్‌కు అవకాశం.. ఇక బంగ్లా చేతిలో భారత్ ఓడితే మాత్రం పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు టెక్నికల్‌గా సజీవంగా ఉంటాయి. ఒకవేళ భారత్ చేతిలో బంగ్లా ఓడితే పాక్ సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతైనట్టే. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోంది. మరోవైపు పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై భారీ తేడాతో విజయం సాధిస్తే.. అలాగే భారత్ తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై స్వల్ప తేడాతో గెలిస్తే.. మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్ టాప్-4కి అర్హత సాధిస్తుంది. ఇక జింబాబ్వే కూడా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తర్వాతి మ్యాచ్‌ల్లో అది భారత్, నెదర్లాండ్స్‌పై గెలవడంతోపాటు.. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో ఓడాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:జూనియర్ ఏబీడీ సంచలన బ్యాటింగ్.. 57 బంతుల్లోనే..