తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ టోర్నీలో మరోసారి నిరాశ.. సెమీస్​లో భారత్​ ఓటమి.. ఫైనల్​కు ఆసీస్​ - టీమ్​ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్​ అప్డేట్స్​

Australia Won the Semifinal match against Teamindia
సెమీస్​లో భారత్​ ఓటమి

By

Published : Feb 23, 2023, 9:49 PM IST

Updated : Feb 23, 2023, 10:23 PM IST

21:43 February 23

సెమీస్​లో భారత్​ ఓటమి.. ఫైనల్​కు ఆసీస్​

టీమ్​ఇండియా ఐసీసీ వరల్డ్​కప్​ కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. గత రెండు టీ20 వరల్డ్ కప్‌లో టీమ్​ఇండియా మెన్స్​ టీమ్​ తీవ్రంగా నిరాశపరిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో భారత మహిళా జట్టు, సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది. 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫీల్డింగ్‌ తప్పిదాల్లో క్యాచ్ డ్రాప్‌ల వల్ల భారత్​ భారీ మూల్యం చెల్లించుకుంది.

ఈ భారీ లక్ష్య ఛేదనలో టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. షెఫాలీ వర్మ 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి ఔట్​ కాగా మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 5 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచింది. ఇక యస్తికా భాటికా కూడా 4 పరుగులే చేసి రనౌట్ కావడం వల్ల 28 పరుగులకే మూడు వికెట్లు కష్టాల్లోకి వెళ్లిపోయింది టీమ్​ఇండియా.

ఈ సమయంలోనే జెమీమా రోడ్రిగ్స్.. సారథి హర్మన్‌ ప్రీత్ కౌర్​ కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. 24 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో ఔటైంది. ఆ తర్వాత రిచా ఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్.. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 52 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కానీ ఆ 52 రన్స్ దగ్గరే రనౌట్ అయ్యింది. గత ఐదేళ్లలో ఆమె రనౌట్​ కావడం ఇదే తొలిసారి. రెండో పరుగు కోసం ప్రయత్నించిన హర్మన్‌, క్రీజులోకి వచ్చేటప్పుడు బ్యాటు మట్టిలో కూరుకుపోవడంతో రనౌట్​గా వెనుదిరిగాల్సి వచ్చింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ 14, స్నేహ్ రాణా 11 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. ఇక భారత్​ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 28 పరుగులు అవసరముండగా.. మన జట్టు గెలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ 18వ ఓవర్‌లో 11 పరుగులు రాగా 19వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే చేసి స్నేహ్ రాణా ఔటైపోయింది. దీంతో చివరి ఓవర్‌లో టీమ్​ఇండియా​ విజయానికి 16 రన్స్​ అవసరమయ్యాయి. తొలి 3 బంతుల్లో 5 రన్సే వచ్చాయి. నాలుగో బంతికి రాధా యాదవ్ ఔట్​ కాగా ఐదో బంతికి సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి 10 పరుగులు కావాల్సి రావడం వల్ల టీమ్​ఇండియా ఓటమి ఖరారైపోయింది. ఇక దీప్తి శర్మ ఫోర్‌తో ఆటను ముగించినా ఫలితం దక్కలేదు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. అసలీ జట్టు ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ అల్సా హేలీ (25), మూనీ (54)జోడీ.. తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలోనే 52 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మెక్ లానింగ్(49), గార్డ్‌నర్ (31) కూడా అదే జోరు కొనసాగిస్తూ దూకుడుగా ఆడారు. భారత్ బౌలర్లకు ఏ దశలోనూ పుంజుకోకపోవడంతో వారు చెలరేగి ఆడారు. టీమ్​ఇండియా నుంచి ఐదుగురు అమ్మాయిలు బౌలింగ్ చేయగా.. ప్రతిఒక్కరూ ఓవర్‌కు కనీసం ఏడు నుంచి ఎనిమిది పరుగులు ఇచ్చుకున్నారు. పేసర్ రేణుక మరీ దారుణంగా 4 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకుంది. అలానే ఈ మ్యాచ్‌తో టీమ్​లోకి రీఎంట్రీ ఇచ్చిన స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో 33 రన్స్​ ఇచ్చేసింది. అలా రేణుక, స్నేహ్​ రాణా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మొత్తంగా మన బౌలర్లు విఫలమవ్వడంతో ప్రత్యర్థి జట్టు దూకుడు ప్రదర్శించింది.

ఇదీ చూడండి:T20 World Cup: అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్లు.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

Last Updated : Feb 23, 2023, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details