తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'​.. తెరపైకి బంగ్లా కొత్త వివాదం - బంగ్లాదేశ్​పై టీమ్​ఇండియా విజయం

టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​పై ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్​.. ముగిసిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనే ప్రయత్నంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు కొత్త వివాదానికి తెరలేపింది. కోహ్లీపై విమర్శలు చేసింది. ఏంటంటే..

kohli fake fileding
కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'​..

By

Published : Nov 3, 2022, 12:41 PM IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి.. ఈ సెమీస్​ బెర్త్​ను పదిలం చేసుకుంది. అయితే ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓటమికి సాకులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఓటమి బాధలో ఉన్న బంగ్లా ఓ కొత్త వివాదాన్ని లేవదీసింది.

బంగ్లా వికెట్​ కీపర్​ బ్యాటర్​ నూరుల్ హసన్.. స్టార్ బ్యాటర్​ కోహ్లీపై ఆరోపణలు చేశాడు​. విరాట్​ 'ఫేక్ ఫీల్డింగ్​' చేశాడని అన్నాడు. ఇది ఆన్ ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని పేర్కొన్నాడు. ఇది తమ జట్టుకు ఐదు పరుగుల నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నాడు.

"ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉన్నప్పటికీ అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు. అటువంటింది మా ఇన్నింగ్స్‌ మధ్యలో కోహ్లి నకిలీ ఫీల్డింగ్‌ను మాత్రం గుర్తించలేకపోయారు. ఒకవేళ అంపైర్లు అది గమనించినట్లయితే మాకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవి. తద్వారా ఈ మ్యాచ్‌లో మేము విజయం సాధించే వాళ్లం. కానీ దురదృష్టవశాత్తు అది కూడా జరగలేదు"అని నూరుల్ హసాన్ పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే?.. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ స్వీపర్‌ కవర్‌ దిశగా షాట్‌ ఆడాడు. అయితే బంగ్లాదేశ్‌ బ్యాటర్లు రెండో పరుగు పూర్తే చేసే క్రమంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ బంతిని వికెట్‌ కీపర్‌ వైపు త్రో చేశాడు. ఈ క్రమంలో ఇన్‌సైడ్‌ రింగ్‌లో ఉన్న కోహ్లి మాత్రం.. బంతి తన చేతిలో లేకపోయినప్పటికీ నాన్‌ స్ట్రైకర్‌ వైపు త్రో చేసేటట్లు యాక్షన్ చేశాడు. అయితే దీన్ని ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించలేదు. అదే విధంగా ఇద్దరు బ్యాటర్లు లిటన్ దాస్, షాంటో కూడా ఏ విధమైన అప్పీల్‌ చేయలేదు.

ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయంటే.. ఐసీసీ రూల్‌ 41.5 ప్రకారం బ్యాటర్‌ పరుగు తీసే సమయంలో ఫీల్డర్‌ ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మోసం చేసినట్లు, అవరోధం కల్పించ కూడదు. ఒక వేళ ఈ నిబంధన ఉల్లంఘించినట్లు అంపైర్లు గుర్తిస్తే బ్యాటింగ్‌ చేసే జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇచ్చే అవకాశం ఉంది. అలానే సదరు బంతిని డెడ్‌గా ప్రకటించొచ్చు. అలాగే 28.2.3 రూల్‌ ప్రకారం.. ఫీల్డర్‌ అన్యాయంగా వ్యవహరించాడని అంపైర్లు గుర్తిస్తే నో బాల్‌ కూడా ఇవ్వొచ్చు. బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులను ఇచ్చే విషయంలో తుది అధికారం ఫీల్డ్‌ అంపైర్లదే. అయితే ఫీల్డర్‌ ఇలా చేశాడని బ్యాటర్ సదరు అంపైర్ దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది. ఫీల్డ్‌ అంపైర్లు చర్చించి.. అవసరమైతే పైస్థాయిలో ఉండే వారికి నివేదించి చర్యలు తీసుకొంటారు. కానీ, భారత్‌-బంగ్లా మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌ చేస్తున్న బ్యాటర్‌ కానీ.. ఫీల్డ్‌ అంపైర్లు కానీ విరాట్ తప్పు చేసినట్లు పరిగణించలేదు.

ఇదీ చూడండి:మయాంక్​పై వేటు.. పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌

ABOUT THE AUTHOR

...view details