ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు అతి పెద్ద లోపం ఓపెనింగే. ఇటు రాహుల్, అటు రోహిత్ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పరుగులు చేయకపోవడం ఒక సమస్య అయితే.. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం మరో పెద్ద తలనొప్పి. ఇద్దరూ కలిసి 215 బంతులాడి చేసిన పరుగులు 214 మాత్రమే. తొలి బంతి నుంచే చెలరేగి ప్రత్యర్థి జట్లను ఆత్మరక్షణలోకి నెట్టడం టీ20ల్లో విజయ సూత్రంగా మారిన ఈ రోజుల్లో ఆరంభంలో మెయిడెన్లు ఆడే, ఓవర్‌కు ఒకట్రెండు పరుగులు తీసి క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించే ఓపెనర్లను భారత జట్టులోనే చూస్తున్నాం.
టీమ్ఇండియాలో అదే అతి పెద్ద సమస్య.. ఇంకెన్నాళ్లు మోయాలి బాధ!
టీ20 ప్రపంచకప్ 2022లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి సెమీఫైనల్లో చతికిలపడింది టీమ్ఇండియా. అసలు మన భారత జట్టులో అతి పెద్ద సమస్య ఏంటంటే?
ఓపెనర్ల నత్తనడక బ్యాటింగ్ తర్వాతి బ్యాటర్ల మీద బాగా ఒత్తిడి పెంచుతోంది. సెమీస్‌లోనూ అదే జరిగింది. మెరుపులు మెరిపించడానికి, శుభారంభం అందించడానికి పవర్‌ప్లేను మిగతా జట్లు అవకాశంగా వాడుకుంటే.. ఆ సమయంలో తడబాటుతో జట్టును ఒత్తిడిలోకి నెట్టడం మన ఓపెనర్లకే చెల్లింది. చిన్న జట్ల మీద చెలరేగిపోయి గణాంకాలను మెరుగుపరుచుకోవడం, పెద్ద జట్లతో కీలక మ్యాచ్‌లు వచ్చినపుడు చేతులెత్తేయడం.. చాన్నాళ్లుగా ఇదీ రాహుల్ వరస! ఇక అతడి స్ట్రైక్ రేట్ మీద చాన్నాళ్ల నుంచి విమర్శలున్నాయి. ఇప్పటికీ జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడడం తప్పితే.. నిలకడగా అతను రాణించిన దాఖలాలు కనిపించవు. ‘ఫినిషర్’ అంటూ భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదు. దీర్ఘ కాలం రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేసి పంత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాక అతడికి తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇలా ప్రపంచకప్ జట్టు, తుది జట్టు ఎంపికలో జరిగిన తప్పిదాలు అన్నీ ఇన్నీ కావు.
ఇదీ చూడండి:'ముందే ఓడి మంచి పని చేశారు! ఫైనల్లో పాక్‌తో ఇలా అయితే తట్టుకోలేకపోయేవాళ్లం'