2007 నాటి తొలి టీ20 ప్రపంచకప్ తరహాలో భారత్-పాకిస్థాన్ మళ్లీ ఫైనల్ ఆడితే..?
చిరకాల ప్రత్యర్థులు రెండూ సెమీస్ చేరగానే ఆ రెండు జట్ల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఇదే ఊహలోకి వెళ్లిపోయారు! ఆ ఊహను నిజం చేసేలా ముందుగా పాకిస్థాన్ తన పని పూర్తి చేసేసింది. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టేసింది. ఇక మన జట్టు వంతు వచ్చింది.
గురువారమే ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా సెమీస్ పోరు. జోరు కొనసాగిస్తూ ఇంగ్లిష్ జట్టు పని పట్టేస్తే.. కలల ఫైనల్‌కు రంగం సిద్ధమవుతుంది.
మరి రోహిత్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందా? టోర్నీలో తడబడుతూ సాగుతున్న ఇంగ్లాండ్‌ను ఇంటిముఖం పట్టిస్తుందా? చిరకాల ప్రత్యర్థితో పోరుకు సై అంటుందా?
భారత్ 2.. ఇంగ్లాండ్ 1..టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ మూడుసార్లు తలపడ్డాయి. 2007, 2012 ప్రపంచకప్‌ల్లో భారత్ విజయాలు సాధించగా.. 2009లో ఇంగ్లాండ్ నెగ్గింది. 2012 తర్వాత ఈ రెండు జట్లూ టీ20 ప్రపంచకప్‌లో తలపడబోయేది ఇప్పుడే. చివరగా ఇంగ్లాండ్‌తో ఇంటా బయటా జరిగిన రెండు టీ20 సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయం. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. నిరుడు మార్చిలో సొంతగడ్డపై జరిగిన 5 టీ20ల సిరీస్‌లో 3-2తో పైచేయి సాధించింది.
అడిలైడ్.. టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో మిగతా అన్ని జట్ల కంటే ఉత్తమ ప్రదర్శనతో సెమీస్ చేరిన టీమ్‌ఇండియాకు కఠిన సవాల్. ప్రపంచ మేటి టీ20 జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను రోహిత్ సేన సెమీస్‌లో ఢీకొనబోతోంది. ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు సూపర్-12లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. బలహీన శ్రీలంక మీద అతి కష్టం మీద గెలిచింది. అలాగని ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లోతైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్.. ఆల్‌రౌండర్ల బలం ఉన్న ఆ జట్టు తనదైన రోజు చెలరేగిపోగలదు. కాబట్టి రోహిత్ సేన అన్ని విభాగాల్లో సామర్థ్యానికి తగ్గట్లు ఉత్తమ ప్రదర్శన చేస్తేనే ఫైనల్ బెర్తు సొంతమవుతుంది.
తుది జట్టులో ఆ ఇద్దరూ?:ఈ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ ముంగిటా భారత తుది జట్టు కూర్పు విషయంలో చర్చ తప్పట్లేదు. సెమీస్ ముంగిటా అదే పరిస్థితి. దినేశ్ కార్తీక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడి స్థానంలో గత మ్యాచ్‌కు రిషబ్ పంత్‌ను ఎంచుకున్నారు. కానీ అతను 3 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో అతడిపై ఓ అంచనాకు రాలేం. రెండో స్పిన్నర్‌గా ఎంచుకుంటున్న అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపని నేపథ్యంలో అతడి బదులు ఓ బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోవడం మంచిదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంత్, కార్తీక్‌లిద్దరినీ తుది జట్టులో ఆడించే విషయాన్ని భారత్ పరిశీలిస్తోంది. కెప్టెన్ రోహిత్ ఈ దిశగా సంకేతాలు ఇచ్చాడు. అయితే పిచ్ పేస్‌కు ఎక్కువ అనుకూలించేట్లయితే, లోతైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో ఉంచుకుని హర్షల్ పటేల్‌ను ఆడించే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. ఇంతకుమించి జట్టులో మార్పులేమీ లేకపోవచ్చు. బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్, విరాట్ కోహ్లిలపై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. చిన్న జట్లు బంగ్లాదేశ్, జింబాబ్వేలపై అర్ధశతకాలు బాదిన రాహుల్.. బలమైన ఇంగ్లాండ్‌పై ఇదే ప్రదర్శన చేస్తాడా లేక ఎప్పట్లా కీలక మ్యాచ్‌లో చేతులెత్తేస్తాడా అన్నది చూడాలి. కెప్టెన్ రోహిత్ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంచుకుంటే హార్దిక్ బౌలర్‌గా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మిడిలార్డర్‌లో బ్యాటర్‌గానూ అతను కీలకం. పంత్, కార్తీక్‌లిద్దరికీ అవకాశం దక్కితే తమ స్థానాలకు ఏమాత్రం న్యాయం చేస్తారో చూడాలి. అర్ష్‌దీప్, షమి, భువిలతో కూడిన పేస్ త్రయం ఇప్పటిదాకా టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసింది. భీకరమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌కు వీరు ఎంతమేర కళ్లెం వేస్తారో చూడాలి.
కాగితంపై భీకరం: మంచి బ్యాటింగ్ రికార్డున్న సామ్ కరన్, వోక్స్ లాంటి ఆటగాళ్లు 8, 9 స్థానాల్లో ఆడతారంటేనే ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. వీరి కంటే ముందు బట్లర్, హేల్స్, స్టోక్స్, మలన్, బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌లతో ఆ జట్టు లైనప్ మామూలుగా లేదు. అయితే కాగితంపై భీకరంగా కనిపిస్తున్న ఈ లైనప్.. ప్రస్తుత టోర్నీలో అంచనాలకు తగ్గట్లు రాణించట్లేదు. బట్లర్ సహా ఎవ్వరూ నిలకడగా ఆడట్లేదు. కానీ వీరిలో ఇద్దరు ముగ్గురు కుదురుకుని చెలరేగారంటే భారత్‌కు కష్టమే. గాయాలతో ఇబ్బంది పడుతున్న మలన్, వుడ్ ఫిట్‌నెస్ సాధించకపోతే సాల్ట్, జోర్డాన్ వారి స్థానాల్లో ఆడతారు. స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్, సామ్ కరన్ లాంటి ఆల్‌రౌండర్లు ఇంగ్లాండ్‌కు పెద్ద బలం. బౌలింగ్‌లో ఆ జట్టు కొంత బలహీనంగా ఉంది. కరన్, వుడ్, వోక్స్, రషీద్ ఎవరికి వారు నాణ్యమైన బౌలర్లే అయినా సమష్టిగా సత్తా చాటట్లేదు. మరి కీలక పోరులో ఈ దళం ఏం చేస్తుందో చూడాలి.