ఇటీవల కాలంలో వరసగా ఐసీసీ మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియా ఘోరంగా వైఫల్యం చెందుతూ వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ సెమీస్‌లోనూ ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి నిష్క్రమించింది. కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేయడం వల్ల అభిమానులను మరింత బాధించింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న భారత్ జట్టును 'చోకర్స్గా' పిలవొచ్చని ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు. కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్‌లను ఉద్దేశించి క్రికెట్ పరిభాషలో ‘చోకర్స్’గా అభివర్ణిస్తారు.
"టీమ్‌ఇండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు. అయితే ఇలాంటి సమయంలో కాస్త పరుషమైన పదాలను వాడదల్చుకోలేదు. ఎందుకంటే ఇందులోని ఆటగాళ్లు కొన్ని సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా రాణిస్తున్నారు. అందుకే ఇంగ్లాండ్‌పై ఓడినప్పటికీ అభిమానులు, విశ్లేషకులు మరీ దారుణంగా మాట్లాడాల్సిన అవసరంలేదు" అని కపిల్ వెల్లడించారు. కపిల్ నాయకత్వంలోని భారత్ 1983 వన్డే ప్రపంచకప్ గెలుచుకోగా.. ఆ తర్వాత ధోనీ సారథ్యంలో టీ20, వన్డే కప్‌లను సొంతం చేసుకొంది. 2007 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు పొట్టి ప్రపంచకప్ సెమీస్‌కు చేరుకోగా.. ఒక్కసారి మాత్రమే కప్‌ను సాధించింది.