టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టుపై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాగే చివరి ఓవర్లో బంతిని వదిలేసి రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శించిన సమయస్ఫూర్తికి... అతడిని పొగడకుండా ఉండలేరు. నవాజ్ వేసిన బంతి వైడ్ బాల్ అవ్వకుండా ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివి? అనే ప్రశ్నకు ఈ బౌలర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా జరిగి ఉంటే అదే తనకు చివరి మ్యాచ్ అయ్యేదన్నాడు.
"నన్ను కొందరు ఇదే ప్రశ్న అడిగారు. ఆ రోజు నిజంగానే బంతి వైడ్ అవ్వకుండా నా ప్యాడ్స్‌ను తాకి ఉంటే నేరుగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయేవాడిని. ఫోన్ చేతిలోకి తీసుకుని.. నేను ఇంతటితో నా క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో ఆటకు వీడ్కోలు పలికేవాడినని వారికి చెప్పాను" అని అశ్విన్ తెలిపాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అశ్విన్ తెలివైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. నవాజ్ వేసిన బంతి వైడ్ అవుతుందని గ్రహించి దానిని వదిలేశాడు. దీంతో ఆఖరి బంతిని లాఫ్టెడ్ షాట్‌కు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.