క్రికెట్ అభిమానులకు తీపి కబురు. యూఏఈ(t20 world cup 2021) వేదికగా అక్టోబర్ 17 నుంచి జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు స్డేడియాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు క్రికెట్ సహా ఆయా క్రీడల నిర్వాహణ వీక్షకులు లేకుండానే లేదా స్టేడియం సామర్థ్యంలో 50శాతం మంది ఫ్యాన్స్ నడుమ జరిపారు. ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రేక్షకుల అనుమతికి మార్గం మరింత సుగమమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం మైదానాల సామర్థ్యంలో 70శాతం మంది అభిమానులకు అనుమతించనున్నట్లు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు తెలిపింది.
"ఒమన్, యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు అభిమానులను అనుమతించడం ఆనందంగా ఉంది. ఈ విషయంలో ప్రోత్సహించిన.. ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న బీసీసీఐ, ఆతిథ్యమివ్వనున్న ఎమిరేట్స్, ఒమన్ క్రికెట్ బోర్డు సహా స్థానిక ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."
-ఐసీసీ
అక్టోబర్ 17 నుంచి నవంబరు 14వరకు టీ20 ప్రపంచకప్‌కు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ జట్టుకు మెంటార్‌గా మాజీ సారథి ధోనీని నియమించారు.