మరో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం టీ- 20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభం కానుంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్-12కు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో.. భారత్(t20 world cup india team), ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్ ఉన్నాయి. మరో ఎనిమిది జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్ 12లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు అసలైన సమరం ప్రారంభమవుతుంది.
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీకి బీసీసీఐ ఆతిథ్యమిస్తుండగా.. మ్యాచ్‌లు మాత్రం యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టోర్నీని.. భారత్ నుంచి యూఏఈకి మార్చారు. ఏడాది వ్యవధిలోనే మరో ఐసీసీ మెగా టోర్నీ(టీ20) జరగనుండడం.. క్రికెట్ ప్రేమికుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకున్న తర్వాత మరోసారి పొట్టి ప్రపంచకప్ జరగలేదు. ఈ టీ-ట్వంటీ ప్రపంచకప్ 2018లోనే జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల 2020కి వాయిదా వేశారు. 2020లో.. ఆస్ట్రేలియా ఈ మెగా టోర్నీని నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో ఆసిస్ నిరాకరించింది. కరోనా నేపథ్యంలో 2020లో జరగాల్సిన టోర్నీ 2021కి వాయిదా పడగా.. బీసీసీఐ ఆతిథ్యమిస్తోంది. ఈ సంగ్రామంలో మొత్తం 16 జట్లు 45 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఐదేళ్ల తర్వాత..
ఐదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌ను(T20 world cup news) కైవసం చేసుకోవాలని అన్ని జట్లు.. వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీ తర్వాత టీ ట్వంటీ సారధిగా వైదొలుగుతానని.. భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ప్రపంచకప్‌ను ఒడిసిపట్టి.. విరాట్‌కు సారధిగా మధుర జ్ఞాపకం అందివ్వాలని భారత జట్టు సభ్యులు భావిస్తున్నారు. క్రికెట్ మేధావిగా ఖ్యాతి గడించిన ధోని మెంటార్‌గా(Dhoni Mentor) భారత్ జట్టు.. అక్టోబర్ 24న తన తొలి మ్యాచ్ ఆడుతుంది. మొదటి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌తో(Ind vs Pak 2021) తలపడనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి.. శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. బాబార్ ఆజమ్ సారధ్యంలోని పాక్ కూడా బలంగా కనిపిస్తోంది. డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్.. మూడోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ గెలవాలని చూస్తుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు కూడా ఈసారి కప్పు గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.