T20 World Cup Pant Dinesh Karthik: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి సెమీస్ పోరు పైనే. గ్రూప్-2లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా.. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీఫైనల్‌లో అడిలైడ్ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ సమయంలో జట్టు కూర్పు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం సరైన టీమ్‌తో బరిలోకి దిగి రోహిత్ సేన తమ ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేయాల్సి ఉంటుంది.
ఎవరికి చోటు దక్కుతుందో?
గ్రూప్ దశలోని తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్‌కు బదులు దినేష్ కార్తీక్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ తుదిజట్టులో స్థానం కల్పించింది. చివరి ఓవర్లలో ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ రాణిస్తాడని ఆశించింది. ఐతే పాకిస్తాన్‌పై కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన దినేశ్ కార్తీక్, బంగ్లాదేశ్‌పై 6, దక్షిణాఫ్రికాపై 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న డీకే.. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చూపిన కారణంగా.. జింబాబ్వే మ్యాచ్‌కు అతడి స్థానంలో పంత్‌ను ఆడించారు. ఐతే ఆ పోరులో పంత్ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌కు ఇద్దరిలో తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.