T20 World Cup Pak Vs Sa: టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అదరగొట్టింది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికాను 33 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఓడించింది.
T20 World Cup: కీలక మ్యాచ్‌లో సఫారీలపై విజయం.. సెమీస్ రేసులో పాక్
T20 World Cup: టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.
అంతకు ముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. షాదాబ్ ఖాన్ (52: 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (51: 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించడం.. మహమ్మద్ హారిస్ (28: 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహమ్మద్ నవాజ్ (28: 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నవాజ్‌తో కలిసి 52 పరుగులు, షాదాబ్‌తో కలిసి ఇఫ్తికార్ 82 పరుగులు జోడించి కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్ నోకియా 4.. పార్నెల్, రబాడ, ఎంగిడి, షంసి తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 9 ఓవర్లకు 69/4 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వరుణుడు కాస్త అనుకూలంగా మారడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లకు 142 పరుగులుగా ఫిక్స్ చేశారు. అయితే అప్పటికే టాప్‌ఆర్డర్‌ను కోల్పోయిన సఫారీల జట్టును కాపాడేందుకు స్టబ్స్ (18), క్లాసెన్ (15) ప్రయత్నించారు. అయితే పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ గెలుపు వైపు కొనసాగలేకపోయింది. చివరికి దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు 108/9 స్కోరు మాత్రమే చేసింది. ప్రస్తుతం ఈ విజయంతో పాకిస్థాన్ 4 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొంది. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలిచినా.. భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఫలితాలపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.