తమ తొలి మ్యాచుల్లో ఓటమి. ఒకే ప్రత్యర్థి చేతిలో భంగపాటు. తమ తదుపరి మ్యాచ్‌లో ఆ రెండు జట్లే తలపడబోతున్నాయి... ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ జట్లేవో..! అవే భారత్, న్యూజిలాండ్(t20 world cup india new zealand match).ఇరు జట్లను ఓడించిన ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్. అయితే, పాక్ చేతిలో భారత్ ఘోర పరాభవం చెందగా.. కివీస్ మాత్రం కాస్త పోరాడి ఓడింది. ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. జట్లపరంగా భారత్, కివీస్ ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోవు(newzland vs teamindia). ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు రెండు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు జట్లు అక్టోబర్ 31న (ఆదివారం) తలపడనున్నాయి. గతంలోటెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడిన ఇరుజట్లూ మరోసారి టీ 20 ప్రపంచకప్‌లో పోరుకు సిద్ధమవుతున్నాయి(india new zealand team 2021). ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు.. టాప్ ఆటగాళ్లెవరు.. ఓ లుక్కేద్దాం.
అండర్-19 నుంచే వారు ప్రత్యర్థులు. అలా ఇద్దరూ తమ దేశ జాతీయ జట్లకు ఎంపిక కావడం.. సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. వారెవరో కాదు మన విరాట్ కోహ్లీ(kohli against new zealand).. కేన్ విలియమ్సన్. విరాట్ కోహ్లీకి సరి సమానుడు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(kane williamson vs virat kohli). నిలకడైన ఆటకు మారు పేరు. ఒక్కసారి క్రీజ్‌లో పాతుకుపోయాడో అంతే సంగతులు. ఔట్ చేయడం అంత తేలికేం కాదు. మనకు ఓపెనర్లు రోహిత్-కేఎల్ రాహుల్ ఉంటే.. న్యూజిలాండ్‌కు గప్తిల్-మిచెల్ ఉన్నారు. గప్తిల్‌ను ఆదిలోనే ఔట్ చేయకపోతే బహు ప్రమాదకారిగా మారిపోతాడు. రోహిత్ శర్మ మాదిరిగా భారీ సిక్సర్లను అలవోకగా కొట్టేయగలడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టే జడేజా మనకుంటే.. కివీస్‌కు నీషమ్ రూపంలో నాణ్యమైన ఆటగాడు ఉన్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే నీషమ్ బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపిస్తున్నాడు.
ఇక బౌలర్ల విషయానికొస్తే.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నీషమ్ వంటి అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లు కివీస్‌వైపు ఉన్నారు. సోధీ, మిచెల్ సాట్నర్ రూపంలో అద్భుతమైన స్పిన్నర్లు ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీతో కూడిన బౌలింగ్ దళం టీమ్‌ఇండియాకూ ఉంది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమవ్వడం జట్టును కలవరపెడుతోంది. కివీస్‌పై రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలానే రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మాయను ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నారు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
టీమ్ఇండియా టాప్ ఆటగాళ్ల బలాబలాలు..
విరాట్ కోహ్లీ.. దూకుడైన నాయకుడు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అర్ధశతకం (57) సాధించి జట్టులో స్థైర్యం నింపాడు. అయితే మంచి ఇన్నింగ్స్ ఆడినా జట్టు భారీ స్కోరు సాధించేలా చూడలేకపోయాడు. విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్ మీద మంచి రికార్డే ఉంది. తొమ్మిది టీ20 మ్యాచుల్లో కోహ్లీ 302 పరుగులు చేశాడు. 70 అత్యధిక స్కోరు. 145.89 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధశతకాలు సాధించాడు. అయితే జట్టు కూర్పులో స్వేచ్ఛను తీసుకుంటే బాగుంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. విఫలమవుతున్న హార్దిక్ పాండ్య స్థానంలో మరొకరిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంఎస్ ధోనీ మార్గదర్శకంలో కోహ్లీ విజయాలను సాధించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
రోహిత్ శర్మ.. ఆరంభం కాస్త లేటుగా ఉండొచ్చేమో గానీ.. క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం భారీ స్కోర్లు చేస్తాడు. పాక్ మీద డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్.. ఆకలిగొన్న పులిలా ఉన్నాడు. కివీస్‌తో రెచ్చిపోవాలని సిద్ధమవుతున్నాడు. అయితే న్యూజిలాండ్‌పై రోహిత్ గత రికార్డును పరిశీలిస్తే మాత్రం దారుణంగా ఉంది. పది మ్యాచుల్లో 129.74 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్‌కే రోహిత్ పరిమితం కావడం గమనార్హం.
కేఎల్ రాహుల్.. రోహిత్‌కు తోడు చక్కటి ఓపెనర్‌గా రాహుల్ పేరు ముందుంటుంది. పవర్‌ప్లే ఓవర్లలో ఆచితూచి ఆడుతూనే బౌండరీలను బాదేందుకు ఏమాత్రం సంశయించడు. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 49 టీ20లను ఆడిన రాహుల్ 1,560 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, పన్నెండు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 110 పరుగులు. న్యూజిలాండ్ మీద రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. కివీస్‌తో ఐదు మ్యాచ్‌లను ఆడాడు. రెండు అర్ధశతకాలతో 224 పరుగులు చేశాడు. పాక్‌తో త్వరగా ఔటైనా.. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానం (626)లో నిలిచాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహల్ కుదురుకుని భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రిషభ్ పంత్.. డేంజరస్ బ్యాటర్లలో పంత్ ఒకడు. ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టగల సమర్థుడు. పాకిస్థాన్ బౌలర్లనూ వదలని పంత్.. సింగిల్ హ్యాండ్‌తో చూడచక్కని సిక్సర్లు బాదాడు. అయితే కాస్త సంయమనం పాటించి ఆడటమే కావాలి. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 34 టీ20 మ్యాచుల్లో 551 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. మిడిల్-లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను సమన్వయం చేసుకునే బాధ్యతను తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. కివీస్‌తో మూడు టీ20 మ్యాచుల్లో 72 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈసారైనా తన గణాంకాలను మెరుగుపరుచుకుంటాడని ఆశిద్దాం..