తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs PAK: భారత్‌ ఓటమికి కారణాలు చెప్పిన సచిన్‌ - IND vs PAK match latest news

ఐసీసీ టోర్నీలో తొలిసారి పాక్ చేతిలో (T20 world cup 2021) టీమ్​ఇండియా పరాజయం పాలైంది. దీనిపై ఎన్నోరకాల కారణాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందూల్కర్​ కూడా తన విశ్లేషణను పంచుకున్నాడు.

IND vs PAK
భారత్‌ ఓటమికి కారణాలు చెప్పిన సచిన్‌

By

Published : Oct 26, 2021, 1:39 PM IST

Updated : Oct 27, 2021, 7:34 AM IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను పంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్‌ ఇలా చెప్పుకొచ్చాడు.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత్‌ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్‌ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్‌ అఫ్రిది విసిరిన అప్‌ఫ్రంట్‌ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సరైన ఫుటవర్క్‌తో కనిపించలేదన్నాడు. పాక్‌ పేసర్‌ గంటకు 140కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. మన బ్యాట్స్‌మెన్‌ అందుకు తగ్గట్టు క్రీజులో లేరన్నాడు. మరోవైపు పాక్‌ జట్టు తమ బౌలర్లను కచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని, ఒకరి తర్వాత ఒకరిని అవసరాలకు తగ్గట్టు బౌలింగ్‌ చేయించిందని సచిన్‌ వివరించాడు.

అలాగే టీమ్‌ఇండియా చాలా రోజులుగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడలేదని, దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశాడు. సూర్యకుమార్‌ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నాడు. అనంతరం కోహ్లీ, పంత్‌ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. మరోవైపు పాక్‌ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్లు తీయలేకపోయిందని సచిన్‌ వివరించాడు. అలా చేసిఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, దాంతో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలోకి వెళ్లేవారని పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్‌ సమయంలో పాకిస్థాన్‌ అదే చేసిందని స్పష్టం చేశాడు. ఇక పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ నెమ్మదిగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్‌ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి:

Last Updated : Oct 27, 2021, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details