తెలంగాణ

telangana

ETV Bharat / sports

PAK VS ENG: ఆదివారమే టీ20 ప్రపంచ కప్​ ఫైనల్​.. విజేత ఎవరో?

T20 World Cup Pak Vs Eng: టీ20 ప్రపంచకప్‌ సమరం తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. మరి గతంలో ఈ రెండు జట్ల ప్రదర్శన గురించి పది పాయింట్లలో తెలుసుకుందాం.

T20 World Cup Pak Vs Eng
T20 World Cup Pak Vs Eng

By

Published : Nov 12, 2022, 9:45 PM IST

T20 World Cup Pak Vs Eng: గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనాలు నమోదైన ఈ టీ20 ప్రపంచకప్‌ సమరం తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌క్రికెట్ మైదానం అతిథ్యం ఇవ్వనుంది. మరి గతంలో ఈ రెండు జట్ల ప్రదర్శన గురించి పది పాయింట్లలో తెలుసుకుందాం.

  1. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 18 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌, 9 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ విజయం సాధించాయి. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
  2. చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ మూడుసార్లు విజయం సాధించగా.. పాక్‌ రెండింటిలో గెలుపొందింది. ప్రపంచకప్‌నకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ వికెట్ కోల్పోకుండా ఛేదించడం విశేషం.
  3. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇరుజట్లు రెండుసార్లు (2009, 2010) తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాడే విజయం సాధించడం విశేషం.
  4. తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 185/5 స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో పాక్‌ 137/7కే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  5. రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 147/9 స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్నిఇంగ్లాండ్‌ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
  6. పాక్‌పై ఇంగ్లాండ్‌ తరఫున అత్యధికంగా ఇయాన్‌ మోర్గాన్‌ (427) పరుగులు చేయగా.. అదిల్‌ రషీద్‌ (17) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్‌ తరఫున అత్యధికంగా బాబర్‌ అజామ్ (560) పరుగులు చేయగా.. హారిస్‌ రవూఫ్‌ (14) వికెట్లు తీశాడు.
  7. టీ20ల్లో పాక్‌పై ఇంగ్లాండ్‌ అత్యధిక స్కోరు 221 కాగా.. అత్యల్ప స్కోరు 135. ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్‌ అత్యధిక స్కోరు 232 కాగా.. అత్యల్ప స్కోరు 89.
  8. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఫైనల్‌కి చేరుకోవడం ఇది మూడోసారి. 2007లో భారత్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా.. 2009 ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి టైటిల్‌ని ఎగరేసుకుపోయింది.
  9. పాకిస్థాన్‌ మూడుసార్లు సెమీస్‌కు చేరుకుంది. 2010, 2021లో ఆస్ట్రేలియాపై, 2012లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
  10. ఇంగ్లాండ్‌ కూడా ఫైనల్‌ చేరుకోవడం ఇది మూడోసారి. 2010లో ఆస్ట్రేలియాని ఓడించి విశ్వవిజేతగా నిలవగా.. 2016 ఫైనల్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. 2021లోసెమీస్‌కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details