తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ నాలుగో విజయం.. సెమీస్​కు అర్హత

టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ దుమ్మురేపింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో.. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సెమీస్​కు అర్హత సాధించింది.

england beat sri lanka
ఇంగ్లాండ్

By

Published : Nov 1, 2021, 11:37 PM IST

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జోరు కొనసాగుతోంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో.. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో హసరంగ (34) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌ రెండేసి వికెట్లు తీయగా, క్రిస్‌ వోక్స్‌, లివింగ్‌స్టోన్ తలో వికెట్‌ తీశారు.

164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మొయిన్ అలీ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి పరుగు తీసే క్రమంలో ఓపెనర్‌ పతుమ్‌ నిశాంక (1) రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్‌ అసలంక (21: 16 బంతుల్లో 3x4, 1x6) వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే అదిల్‌ రషీద్‌ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతడు మొయిన్‌ అలీకి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆరో ఓవర్లో కుశాల్‌ పెరీరా (7).. మోర్గాన్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (13), బనుక రాజపక్సె నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఈ జోడీని క్రిస్‌ జోర్డాన్‌ విడదీశాడు. తొమ్మిదో ఓవర్లో ఫెర్నాండో వికెట్ల ముందు దొరికిపోయాడు. కొద్ది సేపటికే రాజపక్సె (26) కూడా ఔటయ్యాడు. కెప్టెన్ దసున్‌ శనక (26), హసరంగ (34) దూకుడుగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపిస్తున్న క్రమంలో హసరంగ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే శనక రనౌటయ్యాడు.

అంతకు ముందు, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (101: 67 బంతుల్లో 6x6, 6x4) శతక్కొట్టాడు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (40: 36 బంతుల్లో 1x4,
3x6) రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ మూడు, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details