T20 World Cup 2024 India Vs Pakistan Venue :వచ్చే ఏడాది యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను అమెరికాలోనే నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ నిర్ణయం తీసుకుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ స్టేడియం వేదకగా జరగబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షెడ్యూల్‌పై గురువారం ఐసీసీ, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీలు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ టీ20 వరల్డ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసి త్వరలో ప్రకటించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ పార్క్, టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం, న్యూయార్క్ సమీపంలో ఉన్న లాంగ్ ఐలాండ్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్ వేదికల్లో తాము వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని అమెరికా ఇప్పటికే తెలిపింది. అయితే ఈ మూడు వేదికల్లో మొదటి రెండు డెడికేటెడ్ క్రికెట్ గ్రౌండ్లు. న్యూయార్క్‌లో ఈ మెగా టోర్నీ కోసం తాత్కాలికంగా 34,000 సీట్ల సామర్థ్యంతో స్టేడియం నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లో భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్టేడియం క్రికెట్ అభిమానులతో ఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
టీవీ ప్రేక్షకుల కోసం!
భారత్ ఆడే మ్యాచ్‌లను ప్రత్యేక సమయాల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, భారత్‌కు దాదాపు పదిన్నర గంటల వ్యాత్యాసం ఉంది. దీంతో భారత్ టీవీ ప్రేక్షకులను అనుకూలంగా అక్కడ ఉదయం మ్యాచ్ ప్రారంభించేందుకు నిర్వహకులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.