T20 World Cup 2024 Dominica : నిర్ణీత సమయంలో స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేసే పరిస్థితి లేకపోవడం వల్ల వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమకు కేటాయించిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని డొమెనికా తేల్చి చెప్పింది. ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ ఎంపిక చేసిన ఏడు వేదికల్లో డొమెనికా ఒకటి. ఇక్కడి విండ్సర్ పార్క్ మైదానంలో ఒక గ్రూప్, రెండు సూపర్-8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 'విండ్సర్ పార్క్ స్టేడియంలో అవసరమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్ణీత సమయానికి మైదానాన్ని మెరుగులు దిద్దే పని పూర్తి కాదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఈ టోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకూడదని భావిస్తున్నాం' అని డొమెనికా ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో డొమినికాకు ఉన్న ఖ్యాతి దృష్ట్యా తాజా నిర్ణయం అందరికీ మేలు చేస్తుందని డొమినికా పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంకా స్పందించలేదు.
"విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం, బెంజమిన్స్ పార్క్‌లో ప్రాక్టీస్ సహా టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని ముందుగా భావించాము. అయితే ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగాన్ని పరిశీలిస్తే నిర్ణీత గడువులోగా వేదికలను సిద్ధం చేయడం సాధ్యం కాదు. ఇక్కడకు వచ్చేవారికి సరైన వసతులు కల్పించలేము. అవసరమైన చోట అదనపు పిచ్‌లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది. అందుకే ఆతిథ్యం ఇచ్చేందుకు సుముఖంగా లేము."
- డొమినికా ప్రభుత్వం