T20 World Cup : చివరి ఓవర్లో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా.. కోహ్లీ అద్భుతంగా ఆడి టీమ్ ఇండియాను గెలిపించాడని పాక్ మీడియా పొగడ్తల వర్షం కురిపించింది. పాక్ అభిమానులు కూడా కోహ్లీ ఆటతీరుకు ఫిదా అయిపోయారు. పాక్ సెలక్టర్ల నిర్ణయాలను, కెప్టెన్ బాబర్ వ్యూహాలను అక్కడి పత్రికలు తప్పుపడుతున్నాయి.
పాక్ ప్రధాన పత్రిక 'డాన్' విరాట్ ఆటతీరును కొనియాడింది. ఓటమి అంచున ఉన్న భారత్‌ను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చిన ఘనత అతడిదే అని పేర్కొంది. ఇక పాక్ బౌలర్ మహమ్మద్ నవాజ్ భారత్‌కు అయాచితంగా వైడ్, నోబాల్ రూపంలో అదనపు పరుగులు ఇవ్వడం ఫలితాన్ని నాటకీయంగా మార్చేసిందని అభిప్రాయపడింది. పాక్ సెలక్షన్ కమిటీ లోపాలను విరాట్ బహిర్గతం చేశాడని మరో కథనంలో విశ్లేషించింది. ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేసి తప్పుచేసిందని పేర్కొంది. సయిద్ అజ్మల్ తర్వాత పాక్‌కు డెత్ ఓవర్లు వేసే స్పిన్నరే దొరకలేదని పేర్కొంది. నలుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంపిక చేసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడింది.
నరాలు తెగే ఉత్కంఠతో కూడిన మ్యాచ్‌ను విరాట్-పాండ్య ద్వయం సాయంతో భారత్ గెలిచిందని పాక్ పత్రిక 'ది న్యూస్' పేర్కొంది. పాక్ ప్రధాని సహా పలువురు ప్రముఖులు తమ జట్టుకు ధైర్యం చెబుతూ సామాజిక మాధ్యమాల్లో చేసిన కామెంట్లను ప్రస్తావించింది. ఈ మ్యాచ్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 'గ్రేట్ గేమ్' అంటూ ప్రశంసించారు.