తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా? - టీ20 వరల్డ్​ కప్​ లేటెస్ట్ న్యూస్

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. కనీసం ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఈ పరాభవానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. బౌలింగ్‌ వైఫల్యం . బుమ్రా, హర్షల్‌ లేని బౌలింగ్‌ దళం సత్తాచాటలేకపోయింది. ఇప్పుడిక టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసింది. అంతకంటే ముందు జట్టు ఆడేది ఆరు టీ20లే. వీటిల్లోనే బౌలింగ్‌ కూర్పు.. ప్రదర్శనపై ఓ స్పష్టతకు రావాలి. బుమ్రా, హర్షల్‌ తిరిగి జట్టుతో చేరడంతో బౌలింగ్‌కు బలం వచ్చింది. మరి బౌలర్లు తిరిగి లయ అందుకుంటారా? ఉత్తమ బౌలింగ్‌తో ప్రపంచకప్‌ ముందు ఆత్మవిశ్వాసం పెంపొదించుకుంటారా?

t20 world cup 2022
t20 world cup 2022

By

Published : Sep 19, 2022, 7:05 AM IST

T20 World Cup 2022 : గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్‌ దళాల్లో ఒకటిగా టీమ్‌ఇండియా ఎదిగింది. సీనియర్‌ పేసర్లు బుమ్రా, షమి, భువనేశ్వర్‌ వికెట్ల వేటలో సాగడం.. సిరాజ్, శార్దూల్, సైని లాంటి యువ పేసర్లు దూకుడు ప్రదర్శించడం అందుకు కారణం. స్వదేశంలో మాత్రమే కాదు.. విదేశీ పిచ్‌లపైనా మన బౌలర్లు సత్తాచాటి కీలక విజయాలు అందించారు. కానీ ఆసియా కప్‌లో ఒక్కసారిగా భారత బౌలింగ్‌ తేలిపోయింది. జట్టుకు బలమవుతారనుకున్న బౌలర్లు.. బలహీనతగా మారారు. బుమ్రా, హర్షల్‌ గాయాలతో దూరమవడం, షమిని ఎంపిక చేయకపోవడం దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యువ పేసర్లు అర్ష్‌దీప్, అవేశ్‌తో కూడిన ఫాస్ట్‌బౌలింగ్‌ దళాన్ని భువనేశ్వర్‌ నడిపించాల్సి వచ్చింది. మధ్యలో అవేశ్‌ జ్వరంతో దూరమైతే ప్రత్యామ్నాయ పేసరే లేకుండా పోయాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌తో పాటు స్పిన్నర్లూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ఒక్కసారిగా భారత బౌలింగ్‌పై ఆందోళన కలుగుతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ ముందు బౌలింగ్‌పై పూర్తి భరోసా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమపై ఉన్న సందేహాలను పటాపంచలు చేసి, తిరిగి ఫామ్‌ అందుకోవడానికి మన బౌలర్లకు ఈ ఆరు టీ20లే చివరి అవకాశం.

ఆ లోటు..:మోకాలికి శస్త్రచికిత్స కారణంగా ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్‌ జడేజా దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బే. కొంతకాలంగా అతను బ్యాట్, బంతితో చక్కగా రాణిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో ఎప్పటిలాగే మెరుపులా కదులుతున్నాడు. అలాంటి ఆటగాడి లోటును భర్తీ చేసే మరో ఆల్‌రౌండర్‌ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ల్లో దీపక్‌ హుడాను స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా పరీక్షిస్తారేమో చూడాలి. ప్రధానంగా బ్యాటర్‌ అయిన అతను.. ఆఫ్‌స్పిన్‌ వేయగలడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో అతనికి బౌలింగ్‌ అవకాశాలు తక్కువే వచ్చాయి. ఆసియా కప్‌లో అతని చేతికి బంతినిచ్చేందుకు రోహిత్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. మరి బ్యాటింగ్‌ బలోపేతంపై దృష్టి సారిస్తే హుడాను ఆడించి, అతనితో బౌలింగ్‌ చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. లేదు బౌలింగ్‌ పటిష్ఠంగా ఉండాలనుకుంటే అక్షర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. కానీ అతను బ్యాట్, బంతితో ఆకట్టుకోవడం లేదనే చెప్పాలి. మరి ఈ సిరీస్‌ల్లోనైనా అతను ఆల్‌రౌండ్‌ పాత్రకు న్యాయం చేస్తాడేమో చూడాలి. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ కూడా నిలకడ అందుకోవాల్సి ఉంది. మంచి వేగంతోనే బౌలింగ్‌ చేస్తున్న అతను.. వికెట్లు రాబట్టడంలో మరింత కచ్చితత్వం ప్రదర్శించాలి.

ఆ ఇద్దరి చేరికతో..:బుమ్రా, హర్షల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, చాహల్, అశ్విన్, అక్షర్‌.. ఇదీ ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోని ప్రధాన బౌలింగ్‌ బృందం. వీళ్లకు అదనంగా ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా ఉన్నారు. స్టాండ్‌బైలుగా షమి, రవి బిష్ణోయ్, దీపక్‌ చాహర్‌ను తీసుకున్నారు. గాయాల కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా, హర్షల్‌ తిరిగి జట్టుతో చేరడం సానుకూలాంశం. అయితే ఈ విరామం తర్వాత.. ప్రపంచకప్‌కు ముందు వీళ్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలో దిగుతారు. మరి గాయాల నుంచి కోలుకున్న వీళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారోననే ఆసక్తి కలుగుతోంది. గాయానికి ముందు బుమ్రా మంచి ఫామ్‌లోనే కనిపించాడు. హర్షల్‌ కూడా తన వైవిధ్యంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడూ వీళ్లు తిరిగి ఇదే జోరు అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీళ్లతో పాటు ఆసీస్‌తో సిరీస్‌ కోసం జట్టులో ఉన్న దీపక్‌ చాహర్, భువనేశ్వర్, ఉమేశ్‌ (షమి స్థానంలో), అశ్విన్, చాహల్, అక్షర్‌ ఎలా సన్నద్ధమవుతారో? చూడాలి. ఆసియా కప్‌లో భువీ తీవ్రంగా నిరాశపరిచాడు. పాకిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో కీలకమైన 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ బలహీనతను అతను అధిగమించాలి. యూఏఈలో చాహల్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో టీ20ల్లో ఆడే అర్ష్‌దీప్‌ మంచి లయ మీదున్నాడు.

షమిని ఆడిద్దామంటే..:టీ20 జట్టు ఎంపికలో మహమ్మద్‌ షమిని పరిగణించడం లేదంటూ ఆసియా కప్‌నకు అతణ్ని తీసుకోలేదు. ఆ టోర్నీలో భారత పేసర్లు విఫలమవడంతో షమిని జట్టులోకి తీసుకోవాల్సిందంటూ విమర్శలు వచ్చాయి. అలాంటి పేసర్‌ను ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారు? అని మాజీలు ప్రశ్నించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 20 వికెట్లతో గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతణ్ని జట్టులోకి ఎంపిక చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా అతణ్ని ప్రకటించిన సెలక్టర్లు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల్లో ఆడే అవకాశం కల్పించారు. కానీ దురదృష్టవశాత్తూ కరోనా అతనికి అడ్డంకిగా నిలిచింది. దీంతో ఆసీస్‌తో సిరీస్‌ కోసం అతని స్థానంలో మరో సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకున్నారు. సఫారీ సేనతో సిరీస్‌లో షమిని పరీక్షించే ఛాన్స్‌ ఉంది. మరి ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతణ్ని భాగం చేసిన నేపథ్యంలో ఈ ఒక్క సిరీస్‌లో షమి ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. మొత్తానికి ప్రపంచకప్‌కు ముందు ఆందోళనకు కారణమైన బౌలింగ్‌.. ఈ రెండు సిరీస్‌ల్లో ఓ గాడిన పడాల్సిన అవసరం ఉంది.

ఇవీ చదవండి;టీమ్ ఇండియా కొత్త జెర్సీ వచ్చేసింది..

ఎవరు ఏమనుకున్నా సరే.. అతడే నంబర్ 1 ఆల్​రౌండర్!

ABOUT THE AUTHOR

...view details