టీ20 ప్రపంచకప్ టోర్నీలో(T20 World Cup 2021) ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలిసారి కప్పును ముద్దాడింది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. మెల్లగా పుంజుకుని సత్తా చాటింది. ఆదివారం(నవంబర్ 14) జరిగిన ఫైనల్స్‌లో(NZ vs AUS T20) న్యూజిలాండ్‌పై అలవోకగా గెలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా విజయానికి కారణాలేంటో ఓసారి చూసేద్దాం..
- పొట్టి ప్రపంచకప్ టోర్నీ సూపర్ 12లో భాగంగా గ్రూప్-1 తరఫున ఆస్ట్రేలియా తొలుత నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. మెరుగైన రన్ రేట్‌తో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి సెమీస్ అవకాశాలు ఖాయం చేసుకుంది.
- ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా ఓ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఆ మ్యాచ్‌లో భాగంగా 19 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
- ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లో లేడంటూ తొలుత తీవ్రంగా విమర్శలొచ్చాయి. అయితే.. టీ20 ప్రపంచకప్ సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లో వార్నర్ దుమ్మురేపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 49 పరుగులు, న్యూజిలాండ్‌పై 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 89 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
- గ్రూప్ దశలో పెద్దగా ఆడని స్టోయినిస్, వేడ్.. సెమీస్‌లో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పేసర్లలో స్టార్క్, హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
- ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు(ENG vs AUS T20) చేతిలోనే ఓటమి చవిచూసింది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై జట్లపై ఆధిపత్యం చెలాయించింది. సెమీస్‌లో పాకిస్థాన్‌ను(PAK vs AUS) చిత్తు చేసింది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
- బ్యాటింగ్‌తో రాణించడం, బ్యాటింగ్ విఫలమైనా బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించడం, టీమ్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఈ టోర్నీలో ఆసీస్‌కు కలిసొచ్చిన ఆంశాలు.
కాగా, ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగిపోయాడు మిచెల్ మార్ష్. డేవిడ్ వార్నర్(53) పరుగులు చేయగా మార్ష్ 77 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది ఆసీస్.