గత టీ20 ప్రపంచకప్‌లో భారత్ దారుణ పరాభవం ఎదుర్కొంది. గ్రూప్ స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టింది. దీంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. విరాట్ గైర్హాజరీలో అప్పుడప్పుడు జట్టు పగ్గాలను చేపట్టే రోహిత్ శర్మకు బీసీసీఐ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. 2007లో భారత్ సాధించిన ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత సారథ్యంతో బరిలోకి దిగడం విశేషం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకొంది. అయితే ఆసియా కప్‌లో మాత్రం భారత్‌ను సరిగా నడిపించలేకపోయాడు. ఫామ్‌పరంగా చూస్తే ఎప్పుడు ఎలా ఆడతాడో అంచనా వేయడం కష్టం. క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ స్కోర్లు బాదేస్తాడు. పవర్‌ప్లేలోనే ధాటిగా ఆడి పరుగులు రాబట్టేస్తాడు.
అయితే కెప్టెన్‌గా కొన్నిసార్లు బౌలర్లను సమర్థంగా వినియోగించుకోవడంలో కాస్త వెనుకడుగు వేస్తుంటాడని విశ్లేషకుల అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే రోహిత్ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ వంటి మీడియం పేసర్‌ను చాలా మ్యాచుల్లో ప్రత్యర్థి బ్యాటర్లు దంచికొట్టారు. తొలి పది ఓవర్లలో మాత్రం భువీ అద్భుతంగా బౌలింగ్ వేయగలడు. అలాంటి పేసర్‌తో తొలి ఓవర్లలోనే తన కోటాను పూర్తి చేయిస్తే బాగుండేదని క్రీడా పండితుల అభిప్రాయం. అలాగే తుది జట్టుపైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. రిషభ్ పంత్ / దినేశ్ కార్తిక్‌లో ఉత్తమంగా రాణించేవారినే తుది జట్టులోకి తీసుకోవాలి. ఆసీస్ ఫాస్ట్ పిచ్‌లపై పేసర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాప్ టీమ్‌లపై కెప్టెన్‌గా ఆడిన అనుభవం రోహిత్‌కు సొంతం. గత టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి ఇప్పటి వరకు రోహిత్ దాదాపు 30కిపైగా టీ20లను ఆడాడు.
జోష్ తెప్పించేనా..?.. ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. అంతకుముందు 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌కు సాధించి పెట్టిన సారథి. అయితే ఫామ్‌పరంగా విమర్శలు ఎదురొచ్చినా.. జట్టును నడపడంలో మాత్రం అత్యుత్తమమే. అయితే గత జూన్‌లో మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు వన్డే, టీ20 ఫార్మాట్‌లో జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా వచ్చాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 97 టీ20 మ్యాచ్‌లను ఆడిన బట్లర్.. బౌలర్లను ఊచకోత కోయడంలో దిట్ట. దూకుడుగా ఆడి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 పరుగులను బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మన భారత టీ20 లీగ్‌లోనూ రాజస్థాన్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన క్రికెటర్లలో బట్లర్ ఒకడు.
ఇంగ్లాండ్‌కు కొత్త సారథిగా జోస్ బట్లర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీమ్‌ఇండియాతోనే సిరీస్‌లు ఆడటం గమనార్హం. మూడు టీ20ల సిరీస్‌లో బ్యాటర్‌గా రాణించిన బట్లర్ కెప్టెన్ పాత్రకు మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఆ సిరీస్ భారత్ కైవసం చేసుకొంది. అయితే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ సొంతం చేసుకొంది. ఈ సిరీస్‌లో బట్లర్ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టేశాడు. ఈ క్రమంలో తొలిసారి బట్లర్ మెగా టోర్నీ బరిలోకి దిగాడు. తన బ్యాటింగ్, కెప్టెన్సీ సాయంతో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలపాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు.