T20 World Cup 2022 Player Of The Tournament: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. మెల్‌బోర్న్ వేదికగా నవంబరు 13న ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది మంది క్రికెటర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించింది.
ఈ జాబితాలో ఉన్న తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఇద్దరు, పాకిస్థాన్ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, జింబాబ్వే నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ షార్ట్‌లిస్టులో ఉన్న క్రికెటర్లు వీరే
- విరాట్ కోహ్లీ (భారత్)- 296 పరుగులు- 6 మ్యాచ్‌లు
- సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 239 పరుగులు- 6 మ్యాచ్‌లు
- షాదాబ్ ఖాన్ (పాకిస్థాన్)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్‌లు
- షాహిన్ ఆఫ్రిది (పాకిస్థాన్)- 10 వికెట్లు- 6 మ్యాచ్‌లు
- సామ్ కరన్ (ఇంగ్లాండ్)- 10 వికెట్లు- 5 మ్యాచ్‌లు
- జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 199 పరుగులు- 5 మ్యాచ్‌లు- కెప్టెన్‌గా సెక్సెస్
- అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్)- 211 పరుగులు- 5 మ్యాచ్‌లు
- సికిందర్ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్‌లు- 10 వికెట్లు
- వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్‌లు
అదరగొట్టిన కోహ్లీ, సూర్య..
ఈ మెగా టీ20 టోర్నీలో టీమ్ఇండియా.. సెమీస్ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మిడిలార్డర్ మేటి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సూపర్-12 దశ ముగిసే సరికి కోహ్లీ 246 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలువగా.. సూర్య 225 పరుగులతో టాప్-10 జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.