పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్నప్పటికీ కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించే ఉద్దేశం జట్టు యాజమాన్యానికి లేదని స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ప్రపంచకప్‌లో అతను పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల్లో వరుసగా 4, 9, 9 పరుగులే చేశాడు. అయితే కొన్ని ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన రాహుల్ లాంటి నాణ్యమైన బ్యాటర్‌ను పక్కన పెట్టలేమని కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ రోహిత్‌తో కలిసి రాహులే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడని అతను స్పష్టం చేశాడు.
"నేను, రోహిత్ ఏడాది కాలంగా మాటలతోనే కాక చేతలతోనూ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నాం. రాహుల్ ఫామ్ గురించి మాకు ఎలాంటి ఆందోళనా లేదు. అతనో అద్భుతమైన ఆటగాడు. తనేంటో రుజువు చేసుకున్నాడు. రాహుల్‌కు మంచి రికార్డుంది. అతను బాగా ఆడుతున్నాడు. టీ20ల్లో కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటుంది. ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాహుల్ చక్కటి ప్రదర్శన చేశాడు. స్టార్క్, కమిన్స్‌లతో కూడిన బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పరిస్థితులు టాప్ ఆర్డర్ బ్యాటర్లకు సవాలు విసురుతున్నాయి. రాహుల్‌లో ఆల్‌రౌండ్ ఆట ఉంది. బ్యాక్‌ఫుట్‌పై బాగా ఆడతాడు. ఆస్ట్రేలియా పరిస్థితులకు అతను చక్కగా సరిపోయే బ్యాటర్. బయట జనాలు ఏమనుకుంటున్నారన్నది మేం పట్టించుకోం. మాకు కొన్ని ఆలోచనలున్నాయి. కొందరు ఆటగాళ్లపై నమ్మకముంది. ఆటగాళ్లకు ఎత్తుపల్లాలు సహజమని, అలాగే భారత క్రికెట్లో పరిస్థితులు ఎలా ఉంటాయని ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడిన మాకు తెలుసు. మీడియాకు కొంత కాలం కోహ్లి మీద దృష్టి ఉంది. అతను పరుగులు చేయగానే తర్వాతి ఆటగాడు ఎవరా అని చూశారు. రాహుల్ బాగా ఆడితే ఇంకొకరి మీద దృష్టిపెడతారు. ఈ విషయాన్ని నేను కించపరిచే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఎవరి పని వారిది. టీ20 క్రికెట్ అంటేనే సాహసంతో కూడుకున్నది. ఆటగాళ్లను సాహసోపేతంగా ఆడమని చెప్పి వారికి మద్దతుగా నిలవకపోతే కష్టం. ఒకసారి రాహుల్ లయ అందుకుంటే మ్యాచ్‌పై అతడి ప్రభావం ఎలా ఉంటుందో మాకు తెలుసు. రాహులే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తానడంలో మాకు ఎలాంటి సందేహం లేదు" అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడి మధ్యలో మైదానాన్ని వీడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ బంగ్లాపై ఆడేది లేనిది మ్యాచ్ రోజే తెలుస్తుందని రాహుల్ తెలిపాడు. విరాట్ కోహ్లి హోటల్ గదికి సంబంధించిన వీడియో లీక్ కావడంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘అది దురదృష్టకం. విరాట్‌కనే కాదు, అది ఎవరికైనా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లాం. వారు చర్యలు కూడా చేపట్టారు. ఆటగాళ్లు జనాలు, మీడియా కళ్లలో పడకుండా ఉండే ఏకైక ప్రదేశం అది. అక్కడ కూడా భద్రత లేకుంటే బాగుండదు. ఈ వివాదం విషయంలో కోహ్లి చక్కగా వ్యవహరించాడు’’ అని చెప్పాడు.