T10 Highest Score Batsman :క్రికెట్లో ఫార్మాట్ మారుతున్న కొద్ది రికార్డులు కూడా ఆ రేంజ్‌లోనే నమోదవుతున్నాయి. గత కొన్నేళ్లుగా టీ20కి అడ్వాన్స్డ్గా టీ10 ఫార్మాట్‌ను ప్రవేశపెట్టాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. యూఏఈ, ఖతార్, వెస్టిండీస్, యూరోపియన్, ఆఫ్రికాతో పాటు పలు దేశాల బోర్డులు, టీ10 ఫార్మాట్ లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో పార్ట్నర్షిప్లు, క్రీజులో కుదురుకోవడాలు ఉండట్లేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బంతిని బౌండరీ దాటించే పనిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూరోపియన్ టీ10 లీగ్‌లో వరల్డ్ రికార్డు నమోదైంది.
యూరోపియన్ క్రికెట్ (టీ10) లీగ్‌లో భాగంగా కాటలున్యా జాగ్వార్ - సోహల్ హాస్పిటల్టెట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా జట్టు 10 ఓవర్లలోనే 257 భారీ స్కోర్ చేసింది. ఈ జట్టులో బ్యాటర్ హమ్జా సలీమ్ దార్ 43 బంతుల్లోనే 193* పరుగులు (448.86 స్ట్రైక్ రేట్) చేసి ఔరా అనిపించాడు. ఇందులో 14 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే అతడు 188 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీ10 హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్‌గా సలీమ్ దార్ నిలిచాడు. ఇంతకుముందు ఈ జాబితాలో లూయిస్ డు ప్లూయ్ (163 పరుగులు) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో సలీమ్ దార్, లూయిస్ రికార్డు బద్దలుకొట్టాడు. ఇక హలీమ్దార్ టీ10 కెరీర్లో 3 వేల పరుగుల మార్క్ క్రాస్ చేశాడు.