భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎన్నో కోట్ల మంది చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ మ్యాచ్ జరిగే రోజు రానే వచ్చింది. ఆదివారం(అక్టోబరు 24) సాయంత్రం దుబాయ్ వేదికగా జరిగే అత్యంత కీలక పోరులో దాయాది దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. అయితే, టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్ ఆడేముందు రెండు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే?
"పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు బయట నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. మేం ప్రొఫెషనల్ క్రికెటర్స్. క్రికెట్ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇదొక మ్యాచ్‌లా భావించాలి. పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. కానీ మా మానసిక స్థితి, సన్నద్ధత మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. తుది జట్టు వివరాలు వెల్లడించలేను. వీలైనంత సమతూకంతో కూడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో బరిలో దించుతాం. ప్రస్తుతం భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ ఆడిన అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ పాత్రలేంటో స్పష్టత ఉంది. టోర్నీకి మంచి సన్నద్ధతతో వచ్చాం"
- టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లి