గత ఏడాది ఆగస్టులో ఐపీఎల్ కోసం భారత జట్టు యూఏఈకి వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు తీరికలేకుండా బబుల్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ టూర్, శ్రీలంక పర్యటన అనంతరం రెండో విడత ఐపీఎల్ కోసం ఈ సారి సెప్టెంబర్‌లో మరోసారి యూఏఈ వెళ్లింది. లీగ్ పూర్తయిన తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్ కోసం అక్కడే ఉండిపోయింది. కరోనా కారణంగా దాదాపు 15 నెలలుగా ఆటగాళ్లు నిర్బంధంలోనే ఉన్నారు. 'బయోబబుల్లా.. ఆ మాటే ఎత్తకండి బాబోయ్..!' అని కేఎల్ రాహుల్ ఓ సందర్భంలో అన్నాడంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కోసం తగు చర్యలు తీసుకున్నాయి. ఆటగాళ్లకు కొంత స్వేచ్ఛను ప్రకటించాయి. కానీ టీమ్ఇండియా ఆటగాళ్లకు ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఏదైనా సిరీస్‌ను వదులుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే ఆస్ట్రేలియా పర్యటన నుంచి విరామం తీసుకుని మధ్యలో స్వదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు పంత్ మాత్రం ఏడు రోజులు కుటుంబంతో గడపగలిగాడు. అనంతరం ఇంగ్లాండ్ టూర్ కోసం బబుల్‌లో చేరిపోయాడు. 'వాల్వ్స్ కూడా సరిగా లేని ప్రెషర్ కుక్కర్లో ఉండటం లాంటిదే బయోబబుల్' అని భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా అన్నాడంటే మీరు ఊహించుకోవచ్చు.