టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపదేది ఆదివారమే(అక్టోబరు 24). ఇప్పటికే ఈ మ్యాచ్ దేశంలో క్రికెట్ వేడిని పెంచేసింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌పై చర్చించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత్ నుంచి గంగూలీ, కపిల్ దేవ్, అజహరుద్దీన్.. పాక్ నుంచి వసీమ్ అక్రం, యూనిస్ ఖాన్, మహ్మద్ ఆమిర్ ఈ మ్యాచ్ గురించి ఏమన్నారంటే?
"ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాక్‌పై భారత్ ఆధిక్యం 13-0 అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యర్థిపై అజేయంగా ఉన్న రికార్డును టీమ్‌ఇండియా కొనసాగిస్తుంది. ఈ జట్టులోని ఆటగాళ్లందరూ నిజమైన మ్యాచ్ విన్నర్లు. ప్రపంచకప్ గెలవాలనే పదేళ్ల నిరీక్షణకు ఈ జట్టు ముగింపు పలుకుతుందనే ఆశతో ఉన్నాం."
-సౌరభ్ గంగూలీ
"ఒక బౌలర్‌గా నేను... బుమ్రా ఈ టోర్నీలో అధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నా. అతను ముందుకొచ్చి వికెట్లు తీయడంతో పాటు దేశం కోసం టోర్నీని గెలిచే బాధ్యత భుజాలకెత్తుకోవాలి. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవాలి. జట్టులో అతనో విశిష్టమైన ఆటగాడు. భారత్, పాక్ మ్యాచ్‌లో అతను నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాడు.
- కపిల్ దేవ్
భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ భారీగానే ఉంటుంది. ఈ మ్యాచ్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు నెలకొంటాయి, ప్రచారం సాగుతోంది. ఈ పోరులో టీమ్‌ఇండియానే స్పష్టమైన ఫేవరెట్. అదే వేదికల్లో ఐపీఎల్ ఆడిన భారత్‌కు పాక్ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది"
- మహమ్మద్ అజహరుద్దీన్